రామ కోనేరుకు జలకళ
● గత ప్రభుత్వ హయాంలో కోనేరుకు మరమ్మతులు
● భారీగా నీరు చేరడంతో భక్తులు, స్థానికుల హర్షం
● కోనేరులో స్వామివారి తెప్పోత్సవానికి తీరిన చింత
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన (భాస్కర పుష్కరిణి) రామకోనేరు జలకళ సంతరించుకుంది. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో బోడికొండపై నీరు కోనేరులో చేరి సంతృప్తికర స్థాయిలో నిండింది. పక్కనే ఉన్న చెరువు నిండి కోనేరులోకి వరద నీరు ప్రవహిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చొరవతో సుమారు రూ.75లక్షల నిధులు వెచ్చించి రామకోనేరుకు మరమ్మతులు చేయించారు. రెండు కొత్త ఘాట్‌లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం నీరు దీర్ఘకాలంగా నిల్వ ఉండేందుకు కోనేరును భారీగా లోతు కూడా చేయించారు. నిన్న, మొన్నటిదాకా కోనేరులో నీరు ఉన్నప్పటికీ అధిక లోతు కారణంగా నీటి మట్టం అంతంతమాత్రంగానే ఉండేది. తాజాగా కురుస్తున్న వర్షాలకు బోడికొండపై వర్షం నీరు నేరుగా కోనేరులోకి ప్రవహించడంతో రామ పుష్కరిణికి జలకళ సంతరించుకుంది. ఏటా రామతీర్థంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఎప్పటినుంచో ఆనవాయితీ. కోనేరులో సంతృప్తికర స్థాయిలో నీరు లేకపోవడంతో తెప్పోత్సవాన్ని నిర్వహించకుండా కోనేరు వద్ద సంప్రదాయబద్ధంగా పూజలు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. తాజాగా కోనేరులో నీరు పుష్కలంగా చేరడంతో వచ్చే ఆదివారం రామ కోనేరులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామతీర్థం కోనేరులో మూడు ఘాట్ ల వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. కోనేరును ఆనుకుని పిచ్చిమొక్కలు, చెట్లు దట్టంగా అలుముకున్నాయి. ప్రధాన ఘాట్ వద్ద పరిస్థితి దయనీయంగా ఉంది. కోనేరులో అపరిశుభ్ర వాతావరణ నెలకొందని, సంబంధిత అధికారులు స్పందించి కోనేరు పరిసరాలను బాగు చేయించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


