రక్తదానం ప్రాణదానంతో సమానం
● అమరవీరుల వారోత్సవాల్లో పోలీస్‌శాఖ రక్తదానశిబిరం
పార్వతీపురం రూరల్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం విషయంలో అపోహలు వీడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని తద్వారా అవసరమైన వారికి ప్రాణదాతలు కావాలని ఎస్పీ ఎస్‌వీ. మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గల పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం రెడ్‌క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి సంఘీభావంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పోలీసు సిబ్బంది, అధికారులతో పాటు యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల పోలీసుశాఖ తరఫున ఎస్పీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభినందించారు. కార్యక్రమంలో 139మంది రక్తదానం చేయగా 100యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్‌క్రాస్ సంస్థకు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ థామస్‌రెడ్డి సీఐలు మురళీధర్, రంగనాథం, రెడ్‌క్రాస్ ప్రతినిధులు, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.


