ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే చర్యలు
విజయనగరం క్రైమ్: తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో విజయనగరంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో ఎస్పీ దామోదర్ అత్యవసరంగా మంగళవారం సమావేశమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, వరదముంపు ప్రదేశాల్లో శాఖాపరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. నగరంలోని ట్యాంక్ బండ్ రోడ్డు వద్ద పెద్ద చెరువు నీరు పొంగిపొర్లడంతో దగ్గరుండి ఎస్పీ దామోదర్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. అక్కడే పెట్రోల్ బంకు వద్ద చెరువు నీరు పొంగిపొర్లడంతో వన్‌టౌన్ స్టేషన్ సిబ్బందిని సహాయ చర్యల నిమిత్తం ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ పై లేనిపోని వదంతులను నమ్మవద్దని హితవు పలికారు. అనుచితమైన, ఆందోళన కలిగించే వార్తలను నమ్మవద్దన్నారు. అలాంటి పనులు చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్ఛరించారు.ఈ పర్యటనలో ఎస్పీ వెంట వన్ టౌన్, టూటౌన్ సీఐలు చౌదరి, శ్రీనివాస్, ఎస్పీ సీఐ లీలారావు పాల్గొన్నారు.


