నాలుగున్నర గంటలలోగా ఆస్పత్రిలో చేర్చాలి
స్ట్రోక్‌కు గురైన వ్యక్తిని నాలుగున్నర గంటలలోగా ఆస్పత్రిలో చేర్చినట్లయితే సి.టి స్కాన్ ద్వారా ఏరకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది వైద్యులు నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ (రక్తనాళాల్లో గడ్డలు) గా నిర్ధారించిన వారికి ధ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇస్తారు. అవసరమైతే 12 గంటలలోపు క్యాథ్ ల్యాబ్‌కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలు తొలగిస్తారు. ఈ రకమైన చికిత్స వల్ల రోగికి వైకల్యం రాకుండా చూడగలుగుతారు. స్ట్రోక్‌కు గురైన వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్‌కు గురవుతారు. పక్షవాతానికి గురైన రోగులకు రిహ్యాబిలిటేషన్ చాలా ముఖ్యం. కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ ఫిజియోథెరపీ లాంటివి చేయాలి. స్ట్రోక్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల లోగా ఆస్పత్రిలో చేర్చాలి. దీని వల్ల ప్రాణనష్టం, వైకల్యం బారిన పడకుండా చూడవచ్చు. బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి.స్ట్రోక్ తీవ్ర సమస్య అయినప్పటికీ 80 శాతం వరకు నివారించవచ్చు. మద్యం, పొగతాగడం మానుకోవాలి. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయమం చేయాలి. ఆయిల్ ఫుడ్స్, జంక్‌ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఏడున్నర గంటల పాటు నిద్రపోవాలి. డాక్టర్ ఎస్.వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
న్యూరోమెడిసిన్ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


