
మత్తులో ఉంచి వైద్యం
● వైద్యరంగంలో అధిక ప్రాధాన్యం
● ఏడాదిలో లక్ష మంది వరకు రోగులకు ఎనస్థీషియా
● నేడు ప్రపంచ మత్తు వైద్యుల దినోత్సవం
విజయనగరం ఫోర్ట్: వైద్యరంగంలో కొన్నేళ్ల క్రితం వరకు మత్తు వైద్యుల గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోవిడ్ రోగులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడడంతో మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది. సమాజంలో మత్తు వైద్యులు అంటూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. గురువారం ప్రపంచ మత్తు వైద్య దినోత్సవం (వరల్డ్ ఎనస్థీషియా డే) సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. పూర్వ కాలంలో తలమీద, ముక్క దగ్గర మూలికలు పెట్టి మత్తు వచ్చేలా చేసి చికిత్స అందించేవారు. గతంలో మత్తు వైద్యవిద్యను అభ్యసించడానికి పెద్దగా అసక్తి చూపేవారు కాదు. మత్తు వైద్యులు కూడా చాలా తక్కువగా ఉండేవారు. మత్తు విభాగంలో ఆధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ఇటీవల మత్తు వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య పెరుగుతోంది. మత్తు వైద్యులకు ప్రాధాన్యం పెరిగింది. ఆపదలో ఉన్న రోగుల ప్రాణాలు నిలబెట్టడంలో మత్తు వైద్యులు కీలక పాత్ర పోషిస్తారు.
శస్త్రచికిత్సలో కీలక పాత్ర
ఏదైనా వ్యాధికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తు వైద్యులదే కీలక పాత్ర. సంబంధిత వ్యాధికి ఎంత మోతాదులో మత్తు ఇవ్వాలో అంతే మత్తు ఇవ్వాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మత్తు ఇచ్చినట్లయితే రోగి ప్రాణాల మీదకు వస్తుంది. ఎముకల సంబంధిత, ఈఎన్‌టీ, గైనిక్, డెంటల్ శస్త్రచికిత్సలకు, కడుపునొప్పి, అపెండిసైటిస్, పేగుఒరుపు, హెర్నియా, హైడ్రాసిల్, పైల్స్, కేన్సర్, న్యూరోసర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు మత్తు ఇస్తారు. ముఖ్యంగా గుండె మార్పిడి, కాలేయం మార్పిడి, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో మత్తు వైద్యుల పాత్ర అత్యంత కీలకం. ఈ శస్త్రచికిత్సలు చేసేటప్పుడు ప్రతి సెకెను గుండె ప్రతి స్పందనను గమనిస్తూ మత్తు వైద్యులు ఉండాలి. అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి, పురుగు మందు తాగి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వారికి కూడా మత్తు వైద్యులు మత్తు ఇచ్చి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు, ఐసీయూ నిర్వహణ కూడా మత్తు వైద్యులే చూస్తారు.
జిల్లాలో విధుల్లో 100 మంది వైద్యులు
గతంలో మత్తు వైద్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో 100 మంది వరకు మత్తు వైద్యులు ఉన్నారు. వారిలో 70 నుంచి 80 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్వజన ఆస్పత్రిలోనే ఏడాదికి 12 వేల మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది వరకు రోగులకు మత్తు ఇస్తారు.