
రీల్స్ విజేతలకు బహుమతులు
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్ది
పార్వతీపురం రూరల్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ఉత్తమ వీడియో రీల్స్ రూపొందించిన ఐదుగురు విజేతలకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి నగదు బహుమతులను ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన 48 వీడియోల నుంచి వారిని ఎంపిక చేసినట్లు ఆయన బుధవారం తెలిపారు. విజేతలలో పార్వతీపురానికి చెందిన మర్రి రవికి ప్రథమ బహుమతి(రూ. 5,000), సాలూరు మండలానికి చెందిన కోన మహేష్‌కు ద్వితీయ(రూ. 3,000), బహుమతి, సీతంపేటకు చెందిన కె.టెండూల్కర్‌కు తృతీయ (రూ.2,000) బహుమతి లభించాయి. అలాగే, మహతో ఇంద్రాణికి కన్సొలేషన్ బహుమతి, పట్టాభి అనిల్ కుమార్‌కు సోషల్ మీడియా అంబాసిడర్‌గా ప్రత్యేక పురస్కారం దక్కింది. త్వరలోనే వారికి బహుమతి ప్రదానం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్, డీఆర్‌ఓ కె.హేమలత పాల్గొన్నారు.
19న అండర్–13 చెస్ పోటీలు
విజయనగరం: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఈనెల 19న అండర్–13 విభాగంలో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం అధ్యక్షుడు కేకే జగన్నాథ్ బుధవారం తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోలింగ్ ట్రోఫీలో భాగంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ట్రోఫీలో భాగంగా అండర్ –7 నుంచి అండర్–19 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని వెల్లడించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు క్రీడాకారులకు తుది దశ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఫోన్ 74166 66567 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
గంజాయితో ఇద్దరు
నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్: మూడు కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను విజయనగరం జీఆర్పీ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది, విజయనగరం జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా పార్వతీపురం నుంచి విజయనగరం వస్తున్న ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా కేరళ రాష్ట్రంలోని అల్పుజ జిల్లాకు చెందిన సుని, గోవిందరాజులు ఒడిశాలోని మునిగూడ నుంచి కేరళకు అక్రమంగా 3 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా బలిజిపేట పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని జీఆర్పీకి అప్పగించారు. జీఆర్పీ ఎస్సై బాలాజీరావు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం రైల్వే కోర్టుకు తరలించారు.
చంపావతిలో వ్యక్తి గల్లంతు
నెల్లిమర్ల: స్థానిక చంపావతి నదిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. దీనిపై బుధవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జరజాపు పేటకు చెందిన కనకల అప్పారావు(46) భవన నిర్మాణ పనులు చేస్తూ పని లేని సమయంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వంటలు చేయడానికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో థామస్ పేట గ్రౌండ్‌లో పెళ్లి ఫంక్షన్ వంటకు సహచరుడు కిల్లంపల్లి రాజుతో వెళ్లి వంట పూర్తయిన తరువాత ఇద్దరూ చంపావతి నదిలో స్నానికి దిగారు. రాజు ఒడ్డుకు చేరుకోగా అప్పారావు గల్లంతయ్యాడు. కాగా ఆ ప్రదేశంలో లోతుతో పాటు ఊబి కూడా ఉండడంతో గల్లంతవడంతో స్థానికులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది దిగి వెతికినా అప్పారావు ఆచూకీ లభ్యం కాలేదు. అప్పారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రీల్స్ విజేతలకు బహుమతులు

రీల్స్ విజేతలకు బహుమతులు