
బుల్లెట్ బైకులే టార్గెట్
● ముగ్గురు బైక్ దొంగల అరెస్టు
● రూ.14 లక్షలు విలువ చేసే ఏడు బుల్లెట్ బైక్‌లు చోరీ
● వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ శ్రీనివాసరావు
శ్రీకాకుళం రూరల్: జల్సాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలని మార్గాలు వెతికారు. బైక్ హ్యాండిల్ లాక్‌లను అన్‌లాక్ చేయడం నేర్చుకున్నారు. బైక్‌లను దొంగిలించి తక్కువ ధరకు అమ్మడం అలవాటు చేసుకున్నారు. ఆఖరకు పోలీసుల చేతికి చిక్కారు. బుధవారం రూరల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ ( క్రైం) శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం రూరల్ పరిసర ప్రాంతంలో 5 బుల్లెట్ బైక్‌లు, ఆమదాలవలస ప్రాంతంలో 2 బుల్లెట్ బైక్‌లు పోయినట్లు రూరల్ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. రెండు రోజుల కిందట రాగోలు దూసి ప్రాంతంలో రూరల్ ఎస్‌ఐ రాము వాహనాలు తనిఖీలు చేస్తుండుగా రెండు బుల్లెట్లపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో ఆరా తీశామని, అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
ఖరీదైన వాహనాలే ఆదాయ వనరులు..
బుల్లెట్ దొంగతనాలకు పాల్పడిన ఎ–1 దండు రిషివర్ధన్ స్వస్థలం విశాఖపట్నం. విశాఖ కమిషనరేట్‌లో పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఓ వివాహిత హత్య కేసులో ప్రధాన నిందితుడు. పార్వతీపురం రూరల్ పోలీస్టేషన్‌లో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఎ–2 రాయిపల్లి వినోద్ స్వస్థలం సాలూరు కాగా.. అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఐదు సారా కేసులు, సాలూరు ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌తో పాటు గంట్యాడ పోలీస్‌స్టేషన్‌లో ఒక డెకాయిటీ కేసు, అలాగే పార్వతీపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసులతో పాటు ఏడు కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పార్వతీపురం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ కూడా ఓపెన్ చేశారు.
జైలులో పరిచయం..
దండు రిషివర్దన్, రాయిపల్లి వినోద్‌లు ఇద్దరూ జైలులో ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. విలువైన బైక్‌లు దొంగతనం చేసి నంబర్ మారిస్తే ఎవరూ పట్టుకోలేరని ప్లాన్లు గీశారు. గడిచిన మూడు నెలలుగా ఏడు బైక్‌లు దొంగిలించారు. దొంగిలించిన బైక్‌లను మూడో నిందితుడు, బైక్ మెకానిక్ కొత్తూరుకు చెందిన చిట్టి సంతోష్ సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వాహకుడి సాయంతో విక్రయించారు. వీరి వద్ద నుంచి ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బాబురావు, నారాయణరావు, సురేష్, కృష్ణ కానిస్టేబుల్స్‌కు ఎస్పీ మహేశ్వరరెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ పైడపు నాయుడు, ఎస్‌ఐ రాము పాల్గొన్నారు.