
పెదమానాపురం గ్రామస్తుల ధర్నా
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం గ్రామస్తులకు రాక పోకలకు ఇబ్బందులు కలగడంతో శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు అంతా కలిసి ధర్నా నిర్వహించారు. కిలోమీటర్ మేర వాహనాలను నిలుపుదల చేసి వారు పడుతున్న బాధలను తెలియజేశారు. అనంతరం సీఐటీయూ నాయకురాలు లక్ష్మితో కలిసి గ్రామస్తులు కనకరాజు, రామప్పలనాయుడు, ఆదినారాయణ, పైడిరాజు, సత్యారావు, సంజీవి, వెంకటరమణ, రాకేష్, రామునాయుడు మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే కష్టంగా ఉందని కిలోమీటర్ దూరం నడిచి వచ్చినా బస్సులు ఆపడం లేదని, ఎరువులు పట్టుకుని పొలాలకు వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని వాపోయారు. తక్షణమే అధికారులు దృష్టి సారించి అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామానికి చెందిన జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామం నుంచి కిలోమీటర్ దాటి వెళ్లినా బస్సులు ఆపక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని రాత్రి సమయంలో పోలీస్‌స్టేషన్ దాటి బస్సులు ఆపడం వల్ల ఎవరికి ఏ అపాయం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నామన్నారు. పెదమానాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తక్షణమే స్పందించి గ్రామస్తులకు దారి చూపించాలని కోరారు.
ఆర్‌ఓబీ పూర్తవడంతో రాకపోకలకు ఇబ్బందులు
కిలోమీటర్ నడిచి బస్సులు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన
అండర్‌గ్రౌండ్ వంతెన సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి