
రైతుపై టీడీపీ వర్గీయుల దాడి
● అత్యవసర వైద్యం కోసం విజయనగరం తరలింపు
చీపురుపల్లి: అధికార పార్టీ అండతో టీడీపీ వర్గీయులు ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. పంట పొలాల్లో వచ్చిన తగాదాలపై అక్కడితో ఆగకుండా ఇళ్లకు వెళ్లి మరీ దాడులకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇదే సంఘటన చీపురుపల్లి మండలంలోని నిమ్మలవలస పంచాయతీ మధుర గ్రామమైన గుణిదాంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి గాయడిన బాధితుడి కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణిదాం గ్రామానికి చెందిన గండబోయిన ఆదినారాయణకు ఎర్ర సురేష్‌కు మధ్య పొలంలో గట్టు వివాదం నెలకొంది. పొలంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగిన అనంతరం సమసిపోయింది. అయితే కక్ష పెట్టుకున్న ఎర్ర సురేష్, మరికొంత మందితో కలిసి కత్తులు, రాడ్లతో అధికార పార్టీ అండతో సాయంత్రం గండబోయిన ఆదినారాయణ ఇంటికి వెళ్లి విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆదినారాయణ తలపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆదినారాయణను కుటుంబ సభ్యులు చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే ఈ వివాదంలో తమకు గాయాలయ్యాయంటూ ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.దామోదరరావు చెప్పారు.