
రామతీర్థంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆలయంలో భాద్రపద బహుళ దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవాలను వైఖాసన ఆగమ శాస్త్రోక్తంగా జరిపించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హవనం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని వెండి మండపం వద్ద స్వామికల్యాణాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురారోపణం, రుత్విగ్వరణం, తదితర కార్యక్రమాలను తొలి రోజు పూర్తి చేశారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కనీస వేతనం చెల్లించండి
● రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102)లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు బసవరాజు, దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పదేళ్లుగా పనిచేస్తున్నా కేవలం రూ.10వేలు వేతనం చెల్లించడం తగదన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు రమణ, పోలిరాజు, నాయుడు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
నేడు సిరిమాను చెట్టుకు పూజలు
గంట్యాడ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో సిరిమాను చెట్టును గుర్తించారు. దీనికి ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 9.15 గంటలకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు బొట్టుపెట్టు కార్యకమం నిర్వహిస్తారు. చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.
రెవిన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
గరుగుబిల్లి: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని, గరుగుబిల్లి గ్రామాల్లోని పంట పొలాలను మంగళవారం పరిశీలించారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఈ–క్రాప్‌లో పంటల నమోదువల్ల పంటల బీమా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే నోటీసులు జారీచేసి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ బాలను ఆదేశించారు. కార్యక్రమంలో వీఆర్వో కరుణాకర్, కార్యదర్శి బి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులేవి?
రాజాం సిటీ: అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆయా కళాశాలల అకౌంట్లకు జమచేస్తామని ఊదరగొట్టిన కూటమి నేతలు ఆ విషయాన్నే మరిచిపోయారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలను త్రిశంకుస్వర్గంలోకి నెట్టేశారు. జిల్లాలో సుమారు 35 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఉండగా అందులో 20 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే, 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15 వేల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు కళాశాలలను నడిపేందుకు ఆయా యాజమాన్యాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని పలు ప్రైవేటు కళాశాలల నిర్వాహకులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జె.రవికుమార్ డిమాండ్ చేశారు.

రామతీర్థంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు

రామతీర్థంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు