విజయనగరం: ఉత్తరాంధ్ర సంస్కృతిని, మాండలికాన్ని ప్రస్ఫుటపరిచే విధంగా రూపొందించిన ‘వినరా ఓ వేమ’ చిత్రం ప్రేక్షకాదరణ పొంది మంచి విజయం సాధించాలని విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆకాంక్షించారు. పల్సర్ బైక్ రమణ తొలిసారిగా కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం పోస్టర్‌ను కమిషనర్ పల్లి నల్లనయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసతో రూపొందిన అనేక చిత్రాలు విజయవంతమయ్యాయని గుర్తు చేశారు. అదే రీతిన ఉత్తరాంధ్ర యాసతో, పూర్తి గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చిత్ర కధానాయకుడు, పల్సర్ బైక్ రమణ, దర్శకుల్లో ఒకరైన ప్రశాంత్ మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వినరా ఓ వేమ చిత్రాన్ని రూపొందించామన్నారు. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రేక్షకులు ఆదరించి చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. చిత్ర కథానాయికగా వైష్ణవి, నిర్మతగా సురేష్ వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.