
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
గరుగుబిల్లి: మండలంలోని గిజబ గ్రామానికి చెందిన మరడాన ఆదినారాయణ(65) సోమవారం రాత్రి నందివానివలస రహదారి పరిధిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఆదినారాయణ విశ్రాంత మిలటరీ ఉద్యోగి. ఉద్యోగ విరమణ అనంతరం సంతోషపురం పంచాయతీ ఖడ్గవలప జంక్షన్ పరిధిలో నయారా పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బంక్‌నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆదినారాయణ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఫకృద్ధీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య మంగమ్మ, కుమార్తెలు దివ్య, చిన్ను ఉన్నారు.
అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి..
కొత్తవలస: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గల పీడబ్ల్యూ ఆఫీస్ వద్ద గుర్తు తెలియని 25 సంవత్సరాలు వయస్సు గల యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు.ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వంటిపై తెలుపు రంగు ప్యాంట్ కాఫీ కలర్ నెక్క్ బనియన్ ఉన్నాయి. ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండడాన్ని పోలీసులు గమనించారు. సదరు వ్యక్తి సోమవారం రైల్వేస్టేషన్‌లో గల ఫ్లాట్‌ఫామ్–1లో సంచరిస్తూ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ముక్కు నుంచి రక్తం కారడంతో అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి లాలం రాధాకృష్ణ ఫిర్యాదుపై ఎస్సై జోగారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి