
విజయవంతమైన ఆటో కార్మికుల బంద్
విజయనగరం టౌన్: రాష్ట్రప్రభుత్వం ఉచిత బస్సులను ప్రవేశపెట్టి ఆటో, క్యాబ్, టాటామ్యాజిక్‌లను నడుపుతూ పొట్టపోషణ చేసుకుంటున్న కార్మికుల పొట్ట కొట్టిందని, ఓ పక్క అధికారుల వేధింపులు, మరోపక్క కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆటో కార్మికులు తమ నిరసన గళం విప్పారు. ఈ మేరకు బుధవారం ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ, సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతం చేశారు. కోట జంక్షన్ నుంచి బాలాజీ కూడలి, ఆర్‌టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పండా మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడడంతో కార్మికులు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడంతో యువకులు, పండించిన పంటకు గిట్టుబాటు రాక రైతులు ఆటోడ్రైవర్లుగా మారారన్నారు. ఫైనాన్స్ కంపెనీల నుంచి లక్షల రూపాయలు అప్పుచేసి, వాటికి వడ్డీలు కడుతున్నారన్నారు. ఆటోస్పేర్ పార్ట్‌ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఫిట్‌నెస్ టెస్టులను ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో, టాటామ్యాజిక్, క్యాబ్ వాహనకార్మికులపై అధికభారం మోపుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి నాయకులు తమకు ఓటువేస్తే ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15వేలు వాహన మిత్ర కింద ఇస్తామని, ప్రతి ఆటో డ్రైవర్‌కు 5శాతం వడ్డీతో రుణం ఇస్తామని, జీఓ నంబర్ 21ని రద్దుచేస్తామని, కార్మికుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేస్తామని, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆటోకార్మికుల సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. దీనిపై కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
షరతులు లేకుండా వాహనమిత్ర అమలు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె.రాజ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కె.సురేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో,క్యాబ్ ఇతర వాహనరంగ కార్మికులకు వాహనమిత్ర అమలుచేయాలని, ఉచిత బస్సు పథకం వల్ల లన నష్టపోయిన డ్రైవర్లకు రూ. 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డి నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్.అప్పలరాజురెడ్డి, ఏఐటీయూసీ నాయకులు ఈశ్వరరావు, అప్పారావు, ఆటో, టాటా మ్యాజిక్ యూనియన్ నాయకులు పాపారావు, రామునాయుడు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం
డ్రైవర్‌లకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించిన కార్మికులు