
వేట చేస్తూ మత్స్యకారుడి మృతి
పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్య కారుడు గుజరాత్ రాష్ట్రంలో సముద్రంలో వేట చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన బడి రాముడు(44) కొంత కాలం క్రితం బతుకు తెరువు కోసం గుజరాత్‌కు చెందిన బోటులో కూలీగా వేటకు వెళ్లాడు. వేట చేస్తుండగా మంగళవారం ఆకస్మాత్తుగా మృతిచెందాడు, 15 రోజులుగా సముద్రంలో వేట చేస్తున్న రాముడు ఆకస్మాత్తుగా మృతి చెందినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మృతుడికి భార్య సీతమ్మ, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. మృతదేహం గరువారం సాయంత్రానికి పూసపాటిరేగ మండలం చింతపల్లికి వచ్చే అవకాశం ఉందని జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినఅప్పన్న తెలియజేశారు.
981 కేజీల పీడీఎస్ బియ్యం పట్టివేత
సాలూరు: మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 981 కేజీల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ, ముందస్తు సమాచారం మేరకు పెదబజారులో 49 బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న 981కేజీల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి పట్టుకున్నామన్నారు. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, సీజ్ చేసిన బియ్యం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు అప్పగించినట్లు తెలిపారు.
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగబోయే జూనియర్స్ బాల, బాలికల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్‌లు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలనుంచి నగర శివారులో గల విజ్జి స్టేడియంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14,16,18,20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు డిస్కస్‌త్రో, లాంగ్, హైజంప్స్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. పోటీల్లో అండర్–14 విభాగంలో 2011 అక్టోబర్ 15వ తేదీ తరువాత అండర్–16 విభాగంలో 2009 అక్టోబర్ 15వ తేదీ అనంతరం అండర్–18 విభాగంలో 2007 అక్టోబర్ 15వ తేదీ అనంతరం అండర్–20 విభాగంలో 2005 అక్టోబర్ 15వ తేదీ అనంతరం జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా స్పష్టం చేశారు. ఎంపికల్లో 16 సంవత్సరాలలోపు వయస్సు గల క్రీడాకారులు జనన ధ్రువీకరణపత్రంతో పాటు ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా 16 సంవత్సరాలు పైబడిన విభాగంలో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణపత్రం, పదవతరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు ఏలూరు జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏఆర్ డీఎస్పీగా కోటిరెడ్డి
విజయనగరం క్రైమ్: ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీగా ఇ.కోటిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్మ్‌డ్ విభాగంలో ఇన్‌స్పెక్టర్లు కొత్త డీఎస్పీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, అదనపు ఎస్పీ (అడ్మిన్)సౌమ్యలతను ఏఆర్ డీఎస్పీ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక
విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగ పరిఽధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 2 ఏ గర్‌ల్స్ బెటాలియన్ విజయనగరం ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక శిబిరం బుధవారం విజయవంతంగా జరిగింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను 500 మీటర్ల పరుగుపందెం, ఎత్తు, బరువు, కంటి చూపు పరీక్ష, అవయవాల కదలిక పరీక్ష, బాడీ మాస్ ఇండెక్స్ అంచనా, లిఖిత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా శారీరక, మానసిక సామర్‌ాధ్యలను పరిశీలించారు. మొత్తం 150 మంది సీతం కళాశాల బాలికలు, అలాగే 100 మంది సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల బాలికలు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీతం డైరక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, సత్య డిగ్రీ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిదేవమణి, ఎన్‌సీసీ అధికారులు కెప్టెన్ ఎం.సత్యవేని, లెఫ్ట్‌నెంట్ ఎం.వరలక్ష్మి, సీఎస్‌ఓ సత్యనారాయణ, పీడీ మహేష్, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

వేట చేస్తూ మత్స్యకారుడి మృతి

వేట చేస్తూ మత్స్యకారుడి మృతి