
గురజాడ నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి
విజయనగరం గంటస్తంభం: సాహిత్య కారుడు, మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామారావు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక మయూరి జంక్షన్ నుంచి గురజాడ అప్పారావు నివాసం వరకూ జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సమాజంలోని అసమానతలను బటయపెట్టారన్నారు. ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకుని, స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు ప్రజలు అందరూ గౌరవంతో దర్శించుకునే విధంగా గురజాడ గృహాన్ని పునఃనిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురజాడ అప్పారావు జయంతి, వర్ధంతిలను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సూచించారు. ఆయన పేరు మీద సాంస్కృతిక విశ్వవిద్యాలయం స్థాపించాలని చెప్పారు. సైన్స్‌వాక్‌లో పాల్గొన్న కళాకారులు గురజాడ గేయాలను ఆలపించి, గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు, మహాసభ ప్రతినిధులు, కవులు, విద్యావేత్తలు,మేధావులు, కళాకారులు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
జనవిజ్ఞాన వేదిక డిమాండ్