
విద్యార్థులతో చెలగాటం..!
పార్వతీపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దాదాపు 10 ఉన్నాయి. ఇంటర్‌మీడియట్ ఫలితాలు విడుదలై నేటికి ఐదు నెలలు కావస్తున్నా డిగ్రీ చదువుకునే విద్యార్థులకు నేటికీ అడ్మిషన్లు కాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ ప్రవేశాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఏడాదిలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా సెప్టెంబర్ 3వ వారం వచ్చినా అడ్మిషన్లు జరగక తరగతులు ప్రారంభం కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విడతల వారీగా చేపట్టిన ప్రవేశాలు ఇప్పటికే పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పట్ల విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రెండు దఫాలుగా వాయిదా
దాదాపు 30వేలమంది విద్యార్థులు ప్రతి ఏడాది వివిధ కోర్సుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న సుమారు 191 డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరట డబుల్ మేజర్ విధానం తెచ్చేందుకు మూడు నెలల క్రితం దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చి కళాశాలల ద్వారా దరఖాస్తులు తీసుకుంది. అయితే ప్రక్రియ అంతా ముగిసిన వెంటనే మళ్లీ పాత విధానం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మళ్లీ కళాశాలల యాజమాన్యాలను కొత్తగా కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని హడావిడి చేశారు. ఈ పక్రియ కూడా పూర్తయ్యాక గత నెల 20న ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టులో 20 నుంచి 26వరకు ప్రవేశాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆగస్టు 24 నుంచి 28 వరకు వెబ్ అప్షన్లకు గడువు ఇచ్చారు. ఈ మేరకు ఈనెల 1 నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపంతో సకాలంలో తెరుచుకోకపోవడంతో ఈనెల 3వ తేదీవరకు ప్రవేశాలకు, 4వ తేదీవరకు ఆప్షన్లు పెట్టుకోవడానికి గడువు పొడిగించారు. ఈనెల 8వ తేదీన సీట్ల కేటాయింపు, కళాశాలల్లో విద్యార్థుల రిపోర్టింగ్‌కు గడువు ఇచ్చారు. ఈనెల 9న ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ప్రారంభమవుతుందని మరోసారి తాజాగా ఇచ్చిన షెడ్యూల్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే గడువు పూర్తయినప్పటికీ నేటివరకు విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తి కాలేదు. సోమవారం జరిగే అవకాశం ఉంటుందని వారికొచ్చిన సమాచారం మేరకు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే మొదటి విడత సీట్ల కేటాయింపుపై ఇంతవరకు స్పష్టత లేక కాకపోవడంతో రెండు, మూడు విడతలకు సంబంధించి అలాగే స్పాట్, యాజమాన్య కోటా ప్రవేశాలు జరగడానికి మరికొంత జాప్యం జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వం చేసిన ఈ జాప్యం కారణంగా మొదటి ఏడాది సిలబస్, సబ్జెక్టు క్రెడిట్‌లో మార్పులు చేశారు. ప్రవేశాలు పూర్తయ్యి తరగతులు ప్రారంభమయ్యే సమయానికి మార్కెట్‌లో పుస్తకాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన కూడా విద్యార్థులను పీడిస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ ప్రవేశాల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆందోళన చెందుతున్నాయి.
డిగ్రీ ప్రవేశాల్లో గందరగోళం
ఇప్పటికే సీట్లు ఖరారై పలుమార్లు వాయిదా
ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో
30వేలమంది ఎదురు చూపు
తరగతులు నిర్వహిస్తున్నా అడ్మిషన్లు
కాకపోవడంతో ఆందోళన
ఇంటర్ ఫలితాలు విడుదలైనా
ప్రవేశాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
సగం విద్యాసంవత్సరం గడిచింది
గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యంతో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తీవ్ర జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలే దీనికి కారణం. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం కూడా గడిచిపోయింది. మిగిలిన తరగతుల విద్యార్థులంతా త్వరలో సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు. కానీ డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్ ఎప్పుడు పూర్తి చేస్తారో, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాలు విడుదలై ఐదునెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవడం ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం ఈ విధంగా డిగ్రీ విద్యార్థులతో ఆటలాడుకోవడం సరికాదు. ఇంకా ఆలస్యం చేస్తే భవిష్యత్‌లో విద్యార్థుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.
బోను రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అఖిల భారత విద్యార్థి సమాఖ్య

విద్యార్థులతో చెలగాటం..!