
అర్ధరాత్రి ఇంట్లో దోపిడీ
చికెన్
కొత్తవలస: మండలంలోని చింతలపాలెం సమీపంలో గల శీరంశెట్టివానిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టి తీయగానే ఇంటిలోకి ప్రవేశించి కుటుంబసభ్యులను బంధించి బంగారం, నగదును దుండగులు దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మీసాల రవిప్రకాష్ గ్రామానికి కొంతదూరంలో ఇల్లు కట్టుకుని కుటుంబంతో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రవిప్రకాష్ కేటరింగ్ పని నిమిత్తం గాజువాక వెళ్లాడు. ఇంట్లో భార్య సత్యవతి, మామ, అత్త, ఇద్దరు పిల్లలు తలుపులు గడియలు పెట్టి నిద్రపోయారు. ఈ క్రమంలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టడంతో రవిప్రకాష్ మామ తలుపు తెరిచాడు. సదరు దుండగుడు ఒక్క సారిగా ఆయనపై విరుచుకుపడి స్క్రూడ్రైవర్‌తో చెవిభాగంలో పొడిచి లోనికి ప్రవేశించాడు.ఇంతలో మరో ఐదుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు తొడుక్కుని ఇంటిలోకి ప్రవేశించారు. అత్త, మామను ఒక గదిలోను, భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలను మరో గదిలో బంధించి బంగారం, డబ్బు ఎక్కడ ఉందో చెప్పాలని భయభ్రాంతులకు గురిచేశారు. గొడవ చేసి అరిస్తే చంపేస్తాం అంటూ హిందీ, తెలుగు బాషల్లో భయపెట్టారు.
పరిశీలించిన పోలీసులు
బలవంతంగా బీరువా తెరిచి అందులో గల బంగారం తాడు, ఉంగరం, శతమానాలు తదితర వస్తువులు రెండున్నర తులాల బంగారం, కొంత వెండి, రూ 24వేల నగదు దోచుకున్నారు.రవిప్రకాష్ అత్త చేతులకు ఉన్న గాజులు, చెవిదిద్దులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవి ఇత్తడి వస్తువులు అని చెప్పినా వినకుండా వాటిని సైతం లాక్కుని పోయారు. మొత్తం ఆరుగురు దుండగులు చేతికి అందింది దోచుకుని బయటకు వెళ్లి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాష్ అత్తయ్య వద్ద గల ఫోన్‌లో గాజువాకలో గల రవిప్రకాష్‌కు జరిగిన విషయం తెలియపరచగా ఆయన పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. అందరూ వచ్చి తలుపులు తీయగా కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. బాధితుడు రవిప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, స్థానిక ఎస్సై ఎన్.జోగారావుతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు.
హడలిపోయిన కుటుంబ సభ్యులు