
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి
● సీఐటీయూ రాష్ట్ర నాయకులు
● ముగిసిన మహాసభలు
పాలకొండ: ప్రజాసమస్యల పరిష్కారమే కార్మిక సంఘాల లక్ష్యం కావాలని విప్లవవాది, సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. రెండు రోజులుగా పాలకొండ పట్టణంలో నిర్విహిస్తున్న సీఐటీయూ 11వ జిల్లా మహసభలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశంలో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకు అని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం కార్మిక నాయకులు పోరాటాలు చేయక తప్పదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పోరాటాలపై నిర్బంధాలు విధిస్తున్నాయని మండిపడ్డారు. పోరాటాలతోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు, చివరికి అధికారులపైన కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే కార్మికులపై ఉక్కుపాదం మోపే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అణిచివేత ధోరణితో ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పోలీసులను పావులుగా వాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ మహాసభల్లో చూపించిన స్ఫూర్తితో పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం 47 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. ఈ సమావేశాల్లో పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు దావాల రమణారావు, మన్మథరావు, ఎం.కృష్ణమూర్తి, కె.రామస్వామి, తిరుపతిరావు పాల్గొన్నారు.