
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
● వాచ్‌మన్ మృతిపై కుటుంబసభ్యుల
ఆందోళన
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లులో పనిచేస్తున్న వాచమన్ కోడూరు ముత్యాలనాయుడు (70) ఈ నెల 6న మృతిచెందాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు మిల్లు యాజమాన్యంతోపాటు పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే వాచ్‌మన్ మృతిచెందాడంటూ పెద్ద ఎత్తున ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పొనుగుటివలస గ్రామానికి చెందిన కోడూరు ముత్యాలు నాయుడు ఏడాది నుంచి రైస్‌మిల్లులో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14న రాత్రి యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఆ రోజు రాత్రి మిల్లు వద్ద ఊక కోసం రెండు లారీలు వచ్చాయి. లారీలో వచ్చిన కొంతమందిని అక్కడ మద్యం తాగవద్దని వాచ్‌మన్ అడ్డుకోగా దాడికి దిగారు. దీంతో వాచ్‌మన్ ముఖంతోపాటు పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. మరుసటి రోజు విషయం తెలుసుకున్న కుమారుడు లక్ష్మునాయుడు తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడంతో పాటు సంతకవిటి పోలీసులకు, మిల్లర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వూండ్ సర్టిఫికెట్‌లేదని కేసు కట్టలేమని ఎస్సై గోపాలరావు తెలిపారని బాధితులు వాపోయారు. మరోవైపు రూ.15వేలు, రూ.25వేలు ఇప్పిస్తామని ఎస్సై రాజీ ప్రయత్నాలు చేసినట్లు ఫిర్యాదులో బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన
ముత్యాలనాయుడు మృతిని జీర్ణించుకోలేక అటు కుటుంబసభ్యులతో బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చి మిల్లు ఎదుట నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్రతోపాటు రేగిడి, వంగర, సంతకవిటి ఎస్సైలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనను అదుపుచేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. మృతుని కుమారుడి ఫిర్యాదుతో హత్యకేసుగా నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని సీఐ ఉపేంద్ర వెల్లడించారు.

ప్రాణం తీసిన నిర్లక్ష్యం