
ఏపీపీఎస్‌సీ పరీక్ష కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న ఫారెస్టు బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్ల పరీక్ష కోసం అభ్యర్థులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ నంబర్ 08922–236947ను సంప్రదించాలని కోరారు.
ముగిసిన నవోదయ స్కూల్ టీచర్ల ఇంటర్వ్యూ
విజయనగరం అర్బన్: జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసింది. జేసీ సేతుమాధవన్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ప్రక్రియలో పీజీటీ ఇంగ్లిష్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, లెక్కలు రెండు పోస్టుల కోసం ఇంటర్వ్యూలు చేపట్టారు. ఏడాది కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాడానికి ఎంపికలు నిర్వహించారు. మెరిట్ అభ్యర్థులను నియమిస్తామని జేసీ తెలిపారు. ఇంటర్వ్యూ ప్రక్రియలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, నవోదయ ప్రిన్సిపాల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మోడీ పాల్గొన్నారు.
రాజ్యలక్ష్మికి లైఫ్‌టైమ్
అచీవ్‌మెంట్ అవార్డు
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ప్రతిష్టాత్మక ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ అకడమిక్ లీడర్‌షిప్’ లభించింది. కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కాంపెటెన్సీస్ (సీఎసీసీ ఇండియా) సంస్థ ఈ అవార్డును ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదానం చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. ఆమెకు వర్సిటీ సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఏపీపీఎస్‌సీ పరీక్ష కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు