
తల్లికి వందనం తిప్పలు
పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికీ చాలా మంది అర్హుల తల్లుల ఖాతాలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమకాలేదు. కలెక్టరేట్, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకు 18వేల మంది వినతులు అందజేశారు. వేలాది మంది పిల్లల తల్లిగా నమోదైన ‘కిల్లో స్వప్న’ అనే పేరు తొలగింపునకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. పథకం వర్తింపునకు చొరవ చూపడంలేదు. ఇది తప్పిదమా.. లేదంటే సర్కారు స్కామా అంటూ లబ్ధిదారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
విజయనగరం అర్బన్:
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందించిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’గా పేరుమార్చింది. అధికారంలోకి వచ్చి న వెంటనే అర్హులైన పిల్లలందరికీ పథకం వర్తింపజేస్తామని ప్రకటించింది. తొలిఏడాది ఎగ్గొట్టింది. రెండో ఏడాది పథకాన్ని వర్తింపజేసినా వివిధ కొర్రీలతో చాలామంది అర్హులు పథకానికి దూరమయ్యారు. అధిక విద్యుత్ బిల్లులు, తల్లిదండ్రుల పేర్లు మార్పు, భూములు ఎక్కువగా నమోదుకావడం, ఆధార్ అనుసంధానంలో తప్పులు, తదితర సాంకేతిక కారణాలతో పథకం వర్తించకపోవడంతో విద్యార్థుల తల్లు సచివాలయాలు, స్కూళ్లు, కలెక్టరేట్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
కొర్రీల ‘వంద’నం...
కారు ఉందని నమోదుకావడం, విద్యుత్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ చూపడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నమోదుకావడం, అధిక భూము లున్నట్టు చూపడం ఇలా... వివిధ కారణాలు, కొర్రీలతో తమను పథకానికి దూరం చేశారంటూ లబ్ధిదారులు వాపోతున్నారు.
తల్లికి వందనం అందక కలెక్టరేట్, సచివాలయాల చుట్టూ తల్లుల ప్రదక్షిణ
పథకం అందలేదంటూ 18వేల వినతులు
ఇప్పటికీ వారి ఖాతాల్లో పడని డబ్బు
వందల మంది పిల్లలకు తల్లిగా
‘కిల్లో స్వప్న’ పేరు నమోదు
ఇది తప్పిదమా.. లేదా కూటమి సర్కారు స్కామా అన్న అనుమానం