
కీచకు గురువు అరెస్టు
భోగాపురం: భోగాపురం మండలం గుడివాడ గ్రామంలో ట్యూషన్ సెంటర్ నిర్వాహుకుడు విజయ్‌కుమార్ ఓ బాలిక పట్ల ఇటీవల అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆయనకు స్థానిక మహిళలు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్‌ఐ సూర్యకుమారి మంగళవారం గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. స్థానికులు, బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
ప్రసవాల సంఖ్యను పెంచాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
గంట్యాడ: పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. మండలంలోని పెదమజ్జిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలన్నారు. వ్యాధులు ప్రబలే గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ పల్లవి, ఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు.
చిత్తశుద్ధితో పనిచేశారు
విజయనగరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా చిత్తశుద్ధితో పనిచేయడమే కాకుండా కమిషన్ పరిధిలో ఎస్టీ సామాజిక వర్గానికి చక్కటి సేవలందించారని డాక్టర్ డీవీజీ శంకరరావును మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. కమిషన్ చైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో శంకరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. మూడేళ్లపాటు తన బాధ్యతలు అంతఃకరణ శుద్ధితో నెరవేర్చానని చెప్పారు.

కీచకు గురువు అరెస్టు