
ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు (60)ను తన మేనకోడలి భర్త, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు అనే యువకుడు నాటు తుపాకీతో కాల్చిచంపిన ఘటన మంగళవారం సాయంత్రం కలకలం రేపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అప్పారావు చెల్లెలు అయిన చెల్లయ్యమ్మ కుమార్తె లక్ష్మిని పాతవలస గ్రామానికి చెందిన నిందితుడు అప్పారావుకి ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక కుమార్తె ఉంది. ఏడాదిన్నర కిందట కుటుంబ కలహాలతో నిందితుడి భార్య లక్ష్మి పాతవలస గ్రామంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమెను నిందితుడే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడన్న ఆరోపణ ఉంది. అప్పటి నుంచి మృతుడు తన చెల్లెలు (లక్ష్మి తల్లి) కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. నిందితుడి కుమార్తె ఇటీవల రజస్వల అయింది. లక్ష్మికి చెందిన నగలు, డబ్బు ఇవ్వాలని మృతుడు అప్పారావును నిందితుడు అప్పారావు గత కొన్నిరోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ విషయమై రెండు రోజుల కిందట నిందితుడు పాతవలస నుంచి ముసిరాం వచ్చి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ పడ్డారు. నగలు, డబ్బులు ఇవ్వకపోతే తుపాకీతో కాల్చిచంపేస్తానని హెచ్చరించి తిరిగి పాతవలస వెళ్లిపోయాడు. మరలా మంగళవారం సాయంత్రం ముసిరాం వచ్చి మృతుడి ఇంటికి వెళ్లి అప్పారావు ఎక్కడ ఉన్నాడని వాకాబు చేశాడు. పశువుల కళ్లంలో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలపడంతో అక్కడకు వెళ్లి మరోసారి బంగారం, డబ్బుల కోసం మృతుడిని అడిగాడు. గ్రామ పెద్దల సమక్షంలో ఇస్తానని చెప్పడంతో నిందితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్న సిమ్మ స్వామినాయుడు నిందితుడికి సర్ది చెబుతున్నా వినిపించుకోకుండా తనవెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో అప్పారావును కాల్చేశాడు. చనిపోయినట్టు నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతుడికి భార్య అచ్చియ్యమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వృద్ధుడిని నాటు తుపాకీతో కాల్చిచంపిన మేనకోడలి భర్త