
ఎవరీ కిల్లో స్వప్న... ఎందుకు సరిచేయలేదు..?
తల్లికి వందనం పథకం అమలు తీరు సక్రమంగా లేకపోవడం వల్ల అర్హుల జాబితాలు విస్తుగొలుపుతున్నాయి. ‘కిల్లో స్వప్న’ పేరుతో కూడిన ఆధార్ నంబర్ జిల్లాలోని 3 వేల మంది పిల్లలకు తల్లిగా నమోదైంది. ఆమె వివిధ సాంకేతిక కారణాలతో పథకానికి అనర్హురాలు కావడంతో ఆమె పేరు నమోదైన పిల్లలందరికీ పథకం అందని పరిస్థితి. మరోవైపు గతంలో అమ్మఒడి పథకం అందిన వారిలో వేలాది మందికి తల్లికివందనం వర్తింపజేయలేదు. వీరంతా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి హైస్కూల్ విద్యార్థుల తల్లులు 40 మంది, రేగిడి ఆమదాలవలస మండలంలోని ఖండ్యాం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల తల్లులు మరో 30 మంది కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు వచ్చి అధికారులకు గోడు వినిపించారు. ఇవి నిజంగానే తప్పిదాలా.. లేక కూటమి నేత స్కామ్‌లా..? అంటూ అనుమానం వ్యక్తంచేశారు. తమకు అర్హత ఉన్నట్టు గ్రామ, మండల స్థాయి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలు సమర్పించినా పథకం లబ్ధిని ఎందుకు జమచేయడంలేదంటూ అధికారులను ప్రశ్నించారు.