
క్రీడాకారులతో ఆటలు..!
● జిల్లా క్రికెట్‌లో చక్రం తిప్పుతున్న
సెలక్షన్ కమిటీ సభ్యుడు
● పొరుగు జిల్లాలు, రాష్ట్రాల క్రీడాకారులకు పెద్దపీట
● డమ్మీగా మారిన చైర్మన్, కార్యదర్శులు
● అసోసియేషన్ సభ్యులను ఖాతరు చేయని సెలెక్టర్
● జిల్లా క్రీడాకారులకు న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్న తల్లిదండ్రులు
● నిమ్మకునీరెత్తినట్లు జిల్లా క్రికెట్
అసోసియేషన్
విజయనగరం: జిల్లా క్రికెట్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా క్రీడాకారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. జిల్లా జట్ల ఎంపికలో సెలక్షన్ కమిటీ సభ్యుడి ఒంటెత్తు పోకడలతో జిల్లా క్రీడాకారులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నప్పటికీ, ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జిల్లా క్రీడాకారులకు న్యాయం చేస్తామంటూ ప్రకటనలు చేశారు. సంబంధిత శాఖాధికారులతో పాటు, అసోసియేషన్ ప్రతినిధులతో స్థానిక ఎమ్మెల్యే సమీక్ష చేశారు. అయితే ఏడాది కాలమైనా అదే పరిస్థితి కొనసాగడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా క్రికెట్‌లో కీలక స్థానంలో ఉన్న కార్యదర్శితో తనకున్న స్నేహాన్ని ఉపయోగించుకుని జట్ల ఎంపికలో తన మాటే చెల్లుబాటయ్యేలా సెలక్షన్ కమిటీ సభ్యుడు వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తల్లిదండ్రులు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వద్ద ఏకరువు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికై నా దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరం క్రికెటర్ సర్ విజ్జి నడయాడిన జిల్లాలో స్థానిక క్రీడాకారులకే చోటు కల్పించాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కృషి చేయాలని స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
అన్నీ వట్టి మాటలేనా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరేడు నెలలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. చైర్మన్‌గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కార్యదర్శిగా పి.సీతారామరాజు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అయితే నూతన కార్యవర్గం ఏర్పడిన సమయంలో సభ్యులు, అసోసియేషన్ పెద్దలు స్థానిక క్రీడాకారులకే ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పిన మాటలు వట్టి మాటలు గానే మిగిలిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025లో అన్ని విభాగాల జట్ల ఎంపికలో స్థానికేతర క్రీడాకారులకే తగిన ప్రాధాన్యం దక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల అండర్–16 జట్టుకు ఎంపికై న 18 మంది జిల్లా జట్టు క్రీడాకారుల్లో సుమారు 13 మంది పొరుగు జిల్లాలకు చెందిన క్రీడాకారులే ఉన్నారంటే ఇతర జిల్లాల క్రీడాకారుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగే అండర్ –19, అండర్– 23, సీనియర్ విభాగంలోనూ వారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
గుర్రుగా అసోసియేషన్ సభ్యులు
జిల్లా సెలక్షన్ కమిటీ సభ్యుల తీరుపై అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ ఒంటెత్తు పోకడలతో విసుగు చెందిన అసోసియేషన్ సభ్యులు సైతం తల్లిదండ్రులతో పాటు మంత్రి వద్దకు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.
విజయనగరం కాదు..
విశాఖ ‘బి’ జట్టు పేరు సార్థకం
విజయనగరం జిల్లా జట్టులో ఒకప్పుడు క్రికెట్ ఆడే క్రీడాకారులు లేక పొరుగు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చి జిల్లా తరఫున ఆడేవారు. నాటి నుంచి క్రికెట్ వర్గాల్లో విజయనగరం జిల్లా జట్టును విశాఖ బి జట్టుగా పిలిచేవారు. అయితే జిల్లా క్రీడాకారులకు క్రికెట్‌పై అవగాహన పెరగడంతో ఎక్కువ సంఖ్యలో జిల్లా క్రీడాకారులు ఎక్కువమంది క్రికెట్ ను ప్రొఫొషన్‌గా తీసుకున్నారు. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధిక సంఖ్యలో క్రీడాకారులు తయారయ్యారు. అయినా గడిచిన మూడు, నాలుగేళ్లుగా విజయనగరం జిల్లా జట్టులో వలస పక్షుల ప్రాతినిధ్యం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఏటా అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు జరిగితే ప్రతి విభాగంలో సగానికి పైగా పొరుగు జిల్లా క్రీడాకారులకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.
దర్జాగా వస్తారు..
జట్టులో చోటు ఎగరేసుకు పోతారు
పొరుగు జిల్లాల క్రీడాకారులు ఇక్కడ వారి సలహాతోనే జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో చేరుతారు. వారందించే స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా సదరు సెలెక్టర్ వారిని జట్టుకు ఎంపిక చేస్తారు. అయితే వారు పాఠశాలకు వచ్చింది లేదు..వెళ్లిందీ లేదు. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు పాఠశాలకు గాని, కళాశాలకు గానీ వస్తే, జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో ప్రతిరోజు నిర్వహించే ప్రాక్టీస్ సెషనన్‌కు ఎందుకు రారని స్థానిక క్రీడాకారులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్థానికేతర క్రీడాకారుల తల్లిదండ్రులు ఆధార్ ఇతరత్రా సర్టిఫికెట్లు పొరుగు జిల్లాలోనే ఉంటాయి. వీరివి మాత్రం అన్ని సర్టిఫికెట్లు ఇక్కడే ఉన్నట్లు సెలక్షన్ సమయంలో అందిస్తుంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు పాటిస్తున్నాం:
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి జట్టు ఎంపికల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. మూడేళ్ల పాటు జిల్లా పరిధిలో చదివే వారికి అవకాశం కల్పిస్తున్నాం. క్రీడాకారుడి స్టడీ సర్టిఫికెట్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నాం. వాటి ప్రకారమే ఎంపికలకు అనుమతిస్తున్నాం. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవినీతికి తావులేకుండా చూస్తున్నాం.
– పి.సీతారామరాజు, జిల్లా క్రికెట్
అసోసియేషన్ కార్యదర్శి, విజయనగరం.