
తోటపల్లి చివరి ఆయకట్టుకు నీరందించాలి
విజయనగరం అర్బన్: ఖరీఫ్ పంట కాలంలో ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో నీటి పారుదల శాఖ, తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నుంచి జూలై ఆరవ తేదీన నీరు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలోని 12 మండలాల్లో 55444 ఎకరాల ఆయకట్టు ఉందని, 35 కాలువల ద్వారా ఆ ఆయకట్టుకు నీటిని అందించనున్నట్లు తెలిపారు. నీటి సక్రమ పారుదలకు వారా–బందీ పద్ధతి పాటించాలన్నారు. వారా–బందీ పద్ధతిలో సాగునీటిని సక్రమంగా పంపించేందుకు రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల శాఖ సిబ్బందితో తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి చౌర్యం జరగకుండా తనిఖీ బృందాలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఎస్‌ఈ కేవీఎన్ స్వర్ణకుమార్, నీటిపారుదల, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఒప్పంద కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి
ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం అమలు చేయాలని కలెక్టర్, జిల్లాస్థాయి కనీస వేతన కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి కనీస వేతన కమిటీ సమావేశంలో జూలై 2025 నుంచి జూన్ 2026 వరకు చెల్లించవలసిన కనీస వేతనాన్ని సమావేశంలో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాలలో అన్ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.510 నుంచి స్కిల్డ్ లేబర్‌కు రూ.526 వరకు, పట్టణ ప్రాంతాలలో అన్ స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.910 నుంచి స్కిల్డ్ లేబర్‌కు రూ.950 వరకు చెల్లించేందుకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. నిర్ణయించిన ధరల ప్రకారం ఒప్పంద కార్మికులకు వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు రోడ్డు భవనాల శాఖ ఎస్‌ఈ కాంతిమతి, సీపీఓ పి.బాలాజీ, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్‌డీవీ ప్రసాదరావు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్