
మీరిచ్చిన హామీలు గుర్తు చేయడం తప్పా..?
సాలూరు: టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేయడం తప్పా? మీరిచ్చిన హామీలను గుర్తుచేస్తున్న మాపై తప్పుడు విమర్శలు చేస్తారా? అంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మండిపడ్డారు. ఈ మేరకు సాలూరు పట్టణంలోని 2,4,5 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటి కార్యక్రమంలో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ క్రమంలో వార్డుల్లో తిరిగిన ఆయనకు అడుగడుగునా స్థానిక మహిళలు, ప్రజలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదని వాపోతూ , తమ సమస్యలను ప్రజలు రాజన్నదొర ముందు ఏకరువు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మీకు ఈ పాంప్లెట్‌ల ద్వారా ఇస్తున్నామని, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా అవి వస్తాయని ప్రజలకు రాజన్నదొర తెలిపారు.
ఆడబిడ్డ నిధి అమలు చేసేదెప్పుడు?
2024 ఎన్నికల్లో సుమారు 2 కోట్ల 10 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిసిందని అందులో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 60 వేల మందిని తీసేసినా కనీసం కోటి 50 లక్షల మంది మహిళలకు అడబిడ్డ నిధి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నేడు ఆ హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేసే పద్ధతి సరైంది కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, ఏ కష్టమొచ్చినా, ఓ సోదరుడిగా, మీ ఇంటి పెద్దకొడుకుగా అండగా నేను ఉంటానని రాజన్నదొర పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 5 వ వార్డులో అంబేడ్కర్ విగ్రహానికి రాజన్నదొర పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గులిపల్లినాగ, నిమ్మకాయల సువర్ణమ్మ, తాడ్డి లక్ష్మి, శంకరరావు, యశోదకృష్ణ, రౌతు చిన్నయ్య, శ్రీను, చిన్నారావు, పిరిడిరామకృష్ణ, మజ్జి అప్పారావు, కాకి పాండురంగారావు, కొల్లి వెంకటరమణ, హరిబాలాజీ తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర