
వైద్యసౌకర్యం అందక మరణాలు
● ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు
పార్వతీపురం టౌన్: పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్యసౌకర్యాలు అందక ఏడాదికి 350 మంది చనిపోతున్నారని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నిర్మాణసభను స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం ఉత్పన్నమవుతున్న ప్రధానమైన సమస్యలలో ప్రధానంగా గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కరూపాయి కూడా చెల్లించకుండానే మెరుగైన వైద్యం రిఫరల్ ఆస్పత్రుల ద్వారా అందించేవారన్నారు. అయితే ప్రస్తుతం ఈహెచ్‌ఎస్ ద్వారా సరైన వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకునే విధంగా విలీనానికి ముందున్న పాత పద్ధతుల్లోనే రిఫరల్ ఆస్పత్రుల ద్వారా వైద్యసౌకర్యాలు అందించాలని, అలాగే మెడికిల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విలీనానికి ముందు పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు కల్పించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గత ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన 24 నెలలు 11వ పీఆర్‌సీ ఎరియర్స్, డీఏ బకాయిలు పెండింగ్ ఉన్న నాలుగు డీఏలు చెల్లించాలన్నారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నిర్వహించి ఆర్టీసీ సిబ్బందితో ఆబస్సులు నడపాలని, ప్రస్తుతం ఉన్న 10 వేల పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి సిబ్బంది రిక్రూట్‌మెంట్ చేయాలని కోరారు. మహిళలకు ఆగస్టు నుంచి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టక ముందే 3000 కొత్తబస్సులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, జిల్లా అధ్యక్షుడు మరిపి శ్రీనివాసరావు అధ్యక్షతన, జిల్లాకార్యదర్శి పైల సుందరరావు విజయనగరం జోన్ జోనల్ కార్యదర్శి బాసూరి కష్టమూర్తి, విజయనగరం జిల్లా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి గొల్లపల్లి రవికాంత్‌తో తాటు జిల్లాలో ఉన్న పాలకొండ సాలూరు, పార్వతీపురం డిపోల అధ్యక్ష, కార్యదర్శులు అధిక సంఖ్యలో ఉద్యోగులు, మహిళా కార్యకర్తలు పాల్గోన్నారు. సమావేశానికి ముందు డిపోనుంచి ఎన్జీఓ హోమ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.