
వాలీబాల్ విజేత ఏపీఈపీడీసీఎల్ జట్టు
విజయనగరం ఫోర్ట్: ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో విజయనగరం ఏపీఈపీడీసీఎల్ జట్టు విజేతగా నిలిచింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఈనెల 15 నుంచి17 వతేదీ వరకు ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో విజయనగరం జట్టు ప్రథమ స్థానంలో నిలవగా రాజమండి సర్కిల్ జట్టు ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో నెల్లూరు జట్టు నిలిచాయి.
తపాలా రాష్ట్రఆర్గనైజింగ్ కార్యదర్శిగా హేమలత
బాడంగి: తపాలాశాఖ రాష్ట్ర ఉద్యోగుల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.హేమలత (పాల్తేరు పోస్టుమాస్టర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఏఐజీజీడీఎస్‌యూ 14వ వార్షిక ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆమె గురువారం చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర యూనియన్ మహిళా కమిటీ మెంబర్‌గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆమె గతంలో తపాలా ఉద్యోగుల సంఘం బొబ్బిలి బ్రాంచికార్యదర్శిగా, రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షురాలిగా, కేంద్ర ప్రత్యేక ఆహ్వానితురాలిగా కూడా సేవలందించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రయూనియన్ నాయకులు, జీడీఎస్ సభ్యులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
పట్టుబడిన మద్యం ధ్వంసం
రాజాం సిటీ: స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిల్స్‌ను గురువారం ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ దొర సమక్షంలో ఐదు కేసుల్లో పట్టుబడిన రూ.5,500లు విలువైన మద్యాన్ని పోలీసులు పారబోశారు. ఈ సందర్భంగా దొర మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్టుషాపులు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్సై రవికిరణ్, రెవెన్యూ సిబ్బంది అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
దొంగతనం కేసులో 21 నెలల జైలు
డెంకాడ: మండలంలోని అక్కివరం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో విశాఖకు చెందిన మల్లి సూరిబాబుకు 21 నెలల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీనివాసరావు తీర్పు చెప్పినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు గురువారం తెలిపారు. 2021వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన అక్కివరం గ్రామంలోని నడిపల్లి రాజినాయుడు ఇంటిలోని బీరువాలో రూ.లక్షా 3వేల నగదు, ఏడు తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. అప్పట్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై పద్మావతి కేసు దర్యాప్తు చేసి చార్జిషీల్ ఫైల్ చేశారు. మల్లి సూరిబాబు అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించి పై విధంగా శిక్ష విధించిందని ఎస్సై వివరించారు.
ముద్దాయికి ఏడాది జైలు, జరిమానా
విజయనగరం క్రైమ్: రెండేళ్ల క్రితం యువతిపై వేధింపులకు పాల్పడిన ముద్దాయికి ఏడాది జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా కోర్టు/5వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎన్. పద్మావతి గురువారం తీర్పు ఇచ్చారు. ఈ మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లాకు చెందిన ముప్పాల అశ్విన్ రెడ్డి నెల్లిమర్లలోని మిమ్స్ కళాశాలలో చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న ఒక యువతితో పరిచయం ఏర్పరుచుకుని వివిధ సందర్భాల్లో ఆమె నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి, గొడవ పడినట్లు విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్ 2023లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి మహిళా పీఎస్ ఎస్సై పద్మావతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టు విచారణలో అశ్విన్ రెడ్డి వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో పై విధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

వాలీబాల్ విజేత ఏపీఈపీడీసీఎల్ జట్టు

వాలీబాల్ విజేత ఏపీఈపీడీసీఎల్ జట్టు