
టీచర్ల కష్టాలు ఇన్నన్ని కాదయా.!
● నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పేటీఎం పనులు
● ప్రస్తుతం లీడర్‌షిప్, ఎఫ్‌ఎల్‌ఎస్ శిక్షణతో బిజీ
● ప్రతి రోజూ గంట సమయం ఆన్‌లైన్ యాప్‌ల భారం
● పాఠాలు చెప్పడం కంటే ఫొటోల అప్‌లోడ్‌తోనే సరి
● మొరాయిస్తున్న యాప్‌లతో అవస్థలు
● బోధనకు దూరమవుతున్నామంటూ
ఆవేదన
రామభద్రపురం: కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో పాఠశాల తెరిచి నెల రోజులు పూర్తవుతున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు తరగతి గదికి హాజరుకాలేని పరిస్థితి. బోధనేతర పనులతోనే ఉపాధ్యాయులు బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో సుమారు 2,232 పాఠశాలలు ఉండగా 2,10,377 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సుమారు 9,307 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చిన వెంటనే ఫేషియల్ అటెండెన్స్, విద్యార్థుల హాజరుకు సంబంధించి వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. మరుగుదొడ్లు ఆయా శుభ్రం చేసిందా? లేదా? వాటి పరిస్థితి ఎలా ఉంది? మధ్యాహ్న భోజన వంటకాలు, విద్యార్థులకు వడ్డిస్తున్న ఫొటోలు పంపడం, విద్యార్థుల వివరాలు, విద్యార్థి మిత్ర కిట్ల నమోదు వంటి బోధనేతర పనులు ఉపాధ్యాయులే చేయాలి. అలాగే రోజురోజుకీ వాట్సాప్‌లో అర్జెంట్ మెసేజ్‌లు, ఆన్‌లైన్ వర్క్‌లు, వెబెక్స్ మీటింగ్‌లతో పాటు నెల రోజులుగా యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన అయ్యోర్లు బోధనేతర పనులతో బిజీగా ఉండడంతో చదువులు అటకెక్కుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో ఒకటవ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి.
మొరాయిస్తున్న యాప్‌లతో అవస్థలు
మరో వైపు మొరాయిస్తున్న యాప్‌లతో సైతం ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి లీప్ (లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) యాప్‌ను రూపొందిచారు. దాంట్లోనే ఐఎంఎంఎస్, స్టూడెంట్స్ కిట్స్, మెగా పేటీఎం, వంటి వాటిని అనుసంధానం చేశారు. దీంతో సర్వర్ డౌన్ సమస్యలతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.అలాగే విద్యామిత్ర కిట్లు విద్యార్థులకు అందినట్లు తల్లిదండ్రులతో బయోమెట్రిక్ వేయించాలని చెబుతున్నారు. కానీ ఏ పాఠశాలలో కూడా దీనికి సంబంధించిన డివైజ్‌లు అందుబాటులో లేని పరిస్థితి.పెద్ద స్కూళ్లలో క్లాస్ టీచర్‌కు ఒక వారం రోజులు ఇదే పనిలో ఉండాల్సిదేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
సన్నబియ్యం చుట్టూ తిరగాల్సిందే..
ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలకు సన్నబియ్యం అందిస్తున్నారు.ప్రతి నెలా పాఠశాలలకు అందిన అన్ని బస్తాలపై క్యూఆర్‌కోడ్‌లను ఉపాధ్యాయులు స్కానింగ్ చేసి అన్‌లైన్‌లో నమోదు చేయాలి. తర్వాత వంటకు ముందు ఆ బస్తా ఓపెన్ చేసిన ప్రతిసారి క్యూఆర్‌కోడ్‌ను స్కానింగ్ చేసి ఆ బస్తాలో ఉన్న బియ్యం క్వాలిటీ పరిశీలించి అన్‌లైన్‌లో నమోదు చేయాలి. లేందటే బియ్యం స్టాక్ గొడౌన్ నుంచి ఉపాధ్యాయులకు ఫోన్‌లు వస్తున్నాయి.
బోధనేతర పనుల ఒత్తిడిపై పోరాటం
పాఠశాలలు తెరిచి రెండో నెలలో ప్రవేశించినా ఉపాధ్యాయులు సంతృప్తిగా పాఠాలు బోధించిన దాఖలాలు లేవు.యోగా డే, పేరెంట్స్ మీటింగ్ సంబంధించి ఆన్‌లైన్ నమోదు ఇలా అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమవుతున్నారు. దీంతో తరగతులు సక్రమంగా జరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులను కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారు.బోధనేతర పనులు తగ్గించే వరకు అన్ని యూనియన్లు ఉమ్మడి పోరాటాలకు సిద్ధం కావాలి. కె.విజయగౌరి,
యూటీఎఫ్ రాష్ట్ర నాయుకురాలు
నెలంతా బోధనేతర కార్యక్రమాలే..
జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచినా ఎస్జీటీలు, ఎంటీఎస్, వృత్తి విద్యా టీచర్స్ బదిలీల కౌన్సెలింగ్ నిర్వహణతో పదిహేను రోజులు గడిచిపోయాయి.
● అనంతరం గిన్నిస్ రికార్డు కోసం జూన్ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తుగానే ఆయా కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. ఆ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు.
● ఆ తరువాత ఈ నెల 10వ తేదీన తలపెట్టిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాని(మెగా పేటీఎం)కి సంబంధించి పది రోజులు ముందుగానే వివిధ కార్యక్రమాలు చేపట్టారు.ఆ ఫొటోలు సరిగ్గా అప్‌లోడ్ కాలేదని, సక్రమంగా పంపించాలని మళ్లీ ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడంతో టీచర్స్ సరిచేసుకుని అప్‌లోడ్ చేశారు.
● హమ్మయ్య..అది కూడా ముగిసిందనుకుంటే ఈ నెల 14వ తేదీ నుంచి స్కూల్ లీడర్‌షిప్, ఎఫ్‌ఎల్‌ఎన్ వంటి శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరు వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

టీచర్ల కష్టాలు ఇన్నన్ని కాదయా.!

టీచర్ల కష్టాలు ఇన్నన్ని కాదయా.!