
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
జామి:
విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మండలంలోని కుమరాం కేజీబీవీలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా పేరెంట్, టీచర్, స్టూడెంట్స్ ముఖాముఖిలో ప్రతితరగతి గదికి వెళ్లి మాట్లాడారు. బాలికలు చదువులో చూపుతున్న ప్రతిభను తెలుసుకున్నారు. పిల్లల గ్రేడింగ్‌ను పరిశీలించి ముచ్చటించారు. బాలికల తల్లిదండ్రులతో కలిసి టాగ్‌ఆఫ్‌వార్ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. పాఠశాల ప్రాంగణంలో తల్లిపేరుతో మొక్కలను నాటించారు. కార్యక్రమంలో ఎంఈఓ అప్పలనాయుడు, కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.జ్యోతి, ఎంఈఓ జయశ్రీ, ఎస్‌ఎంసీ చైర్మన్ బంగారుతల్లి, కుమరాం సర్పంచ్ పిన్నింటి ఆదిలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కంది పద్మావతి పాల్గొన్నారు.