
నీరు రాదు.. మడి తడవదు
రాజాం:
కూటమి ప్రభుత్వ పాలన అంతా అబద్ధాలతోనే సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీల అమలులోనే కాదు.. చివరకు సాగునీరు విడుదలలోనూ ఏమార్చిన తీరు రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. గొర్లెశ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టు ఆయకట్టుకు ఖరీఫ్‌లో పంటల సాగుకు వీలుగా కుడి కాలువకు ఈ నెల 7న రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా నీరు విడిచిపెట్టారు. ఖరీఫ్ పంటల సాగుకు ఇబ్బందిలేకుండా సాగునీరు విడుదల చేస్తామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ ఎమ్మెల్యే ప్రకటించడంతో రైతులు సంతోషించారు. సాగునీరు వస్తుందన్న ధీమాతో పొలాల్లో వరి వెదలు, నారుమడుల్లో విత్తనాలు జల్లారు. అయితే, ప్రారంభించిన రోజునే నీటి సరఫరాను ప్రాజెక్టు అధికారులు నిలిపివేశారు. అంతే.. వారం రోజులుగా ఎండలు మండిపోతుండడంతో నారుమడులు, వెద పొలాలు ఎండిపోతున్నాయి. కాలువలో నీటి ప్రవాహం లేకపోవడం, మడితడిచే దారి కనిపించకపోవడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు.
● 25వేల ఎకరాల ఆయకట్టు
మడ్డువలస కుడి ప్రధాన కాలువ నుంచి వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. రెండో విడతలో మరో 15 వేల ఎకరాల ఆయకట్టుకు కాలువల విస్తరణ జరుగుతుండడంతో ఆ ఆయకట్టులోకి కూడా కొంత ప్రాంతానికి నీటిని అందించాల్సి ఉంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది రైతులు తొలకరి జల్లులు కురవగానే రైతులు వరి సాగు పనులు చేపట్టారు. సకాలంలో సాగునీరు వస్తుందన్న ధీమాతో వరి నారుమడులను అధికంగా సిద్ధంచేశారు. ఇక్కడ నీటికొరత ఉండదని భావించి, నారు ఏపుగా పెరిగిన తరువాత ఇక్కడ నుంచి మిగిలిన ప్రాంతాల్లో పొలాలకు తరలించేందుకు వరి నారుమడులు కాలువ ఆయకట్టు పరిధిలో విస్తారంగా ఏర్పాటుచేశారు. వారంరోజులుగా అటు వర్షాలు కురవకపోగా, ఇటు కాలువ ద్వారా నీరు రాకపోవడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయి. విత్తనాలు సక్రమంగా పంపిణీలేక ఇప్పటికే అవస్థలు పడిన రైతన్నకు నారుమడులు ఇప్పుడు ఎండిపోవడంతో దిగాలు చెందుతున్నారు.
● నీరు అందేలా చూస్తాం..
మడ్డువలస కుడి ప్రధాన కాలువలో సాగునీరు రాకపోవడంపై ప్రాజెక్టు ఏఈ వెంకట్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా, ప్రస్తుతం కాలువలో 100 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టామని తెలిపారు. వారంరోజుల కిందట విడిచిపెట్టిన నీరు ఇంతవరకూ ఇంకారాలేదని చెప్పగా డామ్ ఇంజినీరింగ్ అధికారులు జాప్యం కారణంగా నీటి విడుదల ఆలస్యమైందని, రెండు రోజుల్లో నీటి ప్రవాహాన్ని పెంచి థైలాండ్ ప్రాంతాలకు కూడా నీరు అందేలా చూస్తామని అన్నారు.
సాగునీరు విడిచిపెట్టాక పనులా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలు సంక్షేమం కంటే టీడీపీ కార్యకర్తల జేబులు నింపేందుకే తహతహలాడుతోంది. ఇందులో భాగంగా హుటూహుటినా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి, చైర్మన్‌ల ఎంపిక చేపట్టింది. వేసవి మొత్తం వదిలేసి, కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీల, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సాగునీటి కాలువలకు మళ్లించింది. ఓఅండ్‌ఎమ్(ఆపరేషన్ అండ్ మెంటినెన్స్) పేరుతో కాలువల్లో పూడికతీతలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మడ్డువలస కుడికాలువ పరిధిలో 17 టీసీలకు సంబంధించి రూ.1.17 కోట్లు మంజూరీచేసింది. వీటిని ఆయా గ్రామాల పరిధిలోని టీడీపీ కార్యకర్తలకు అప్పగించి కాలువలో పూడికతీతలు చేయిస్తోంది. ఈ పనులు కాలువలోకి నీరు వచ్చిన తరువాత చేసేందుకు వీలు లేకపోవడంతో, ఎలాగోలా ఇప్పుడే కార్యకర్తలు ద్వారా చేయించే పనిలో కాలువల ఏఈలు, డీఈఈలు పడ్డారు. కాలువలో నీటిని నిలుపుదలచేసి, తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. దీంతో కాలువలోకి నీరు రాకుండా నిలుపుదలచేశారు. ఆయకట్టులోని రైతుల వరి నారుమడులు ఎండిపోతున్నా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది.

నీరు రాదు.. మడి తడవదు