
నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిద్దాం
విజయనగరం గంటస్తంభం: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలుచేయాలని అన్ని రాష్ట్రాల మీద రుద్దుతోందని, దీనిని వ్యతిరేకిద్దామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ పలుపునిచ్చారు. కె.ఎల్.పురం ఎన్‌పీఆర్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు డి.రాము ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేసేదిలేదని అసెంబ్లీల్లో తీర్మానం చేయగా, చంద్రబాబు ప్రభుత్వం మిన్నకుండడం విచారకరమన్నారు. ప్రైవేట్ విద్యా విధానాన్ని పెంపొందించేందుకు పీ–4 విధానాన్ని తీసుకొస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఓ నంబర్ 77 రద్దు చేస్తామని, హాస్టల్ భవనాలు నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామంటూ మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా విద్యార్థిలోకాన్ని మోసం చేశారన్నారు. విద్యార్థులను అణగదొక్కే కూటమి ప్రభుత్వ చర్యలపై ఎదురుతిరగాల్సిన సమయం ఆసన్నమైందని, పోరాటాలకు సిద్ధంకావాలన్నారు. సభలో ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇ.రాము, సీహెచ్.వెంకటేష్, సభ్యులు శిరీష ,రాజు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ
జిల్లా ప్లీనరీ సమావేశాలు