
అన్నదాతలపై అక్రమ కేసులా?
బొబ్బిలి: మామిడి కాయలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన నేరానికి అన్నదాతలపై తిరిగి అక్రమ కేసులు బనాయించడం దేశంలో ఎక్కడా ఇంత వరకూ వినలేదని ఉత్తరాంధ్ర సాధ న సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఇక రాష్ట్రమంతా విస్తరించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. మామిడికి ధరలేకపోవడంతో చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం రైతులు ఎంతో ఆవేదనతో పంటను రోడ్డపై పారబోస్తున్నారన్నారు. ఇటువంటి రైతులను ఆదుకోవడం మానేసి తిరిగి కేసులు నమోదు చేయడం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నామన్నారు. రాజకీయ కక్షలతో కూటమి నాయకులు బరితెగిస్తున్నారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని అసమర్థ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని విమర్శించారు. పోలీసు కార్యాలయాల్లోకి న్యాయవాదులను సైతం అనుమతించకపోవడం కూటమి అనాగరిక చేష్టలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. రైతులను నిర్బంధించడం, వారిని ఉన్మాదులుగా చూడడం కూటమి నాయకులకే చెల్లిందన్నారు. నలుగురికీ అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం ముఠా అని అనడం ఎంతవరకూ సబబో ఆ నాయకులే చెప్పాలన్నారు. రైతులకు కూటమి సర్కారు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తమ్మిరెడ్డి కృష్ణ, వజ్జి రమేష్, వజ్జి రవికుమార్, తదితరులు ఉన్నారు.