
పాపం.. పాలిటెక్నిక్ విద్యార్థులు!
చీపురుపల్లి:
నేలపైనే నిద్ర.. 30 మందికి రెండే రెండు మరుగుదొడ్లు.. అత్యవసరమైతే ఇక అంతే.. అర్థరాత్రి వేళ ఏదైనా సమస్య ఎదురైతే చెప్పుకునేందుకు వార్డెన్ వంటి వారెవ్వరూ ఉండరు. విద్యార్థులే నెలకు రూ.3వేలు చెల్లిస్తే కళాశాల సిబ్బంది వసతిగృహం నిర్వహిస్తున్న దుస్థితి. ఇదీ చీపురుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థుల వసతి సమస్యకు నిలువెత్తు సాక్ష్యం. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థులను సమస్యలు వెంటాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కళావెంకటరావు దృష్టికి తీసుకెళ్లినా స్పందన శూన్యం. కౌన్సెలింగ్‌లో ఇతర జిల్లాలు నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థుల కోసం వసతి సదుపాయం కల్పించలేరా అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి వినిపిస్తోంది.
ఇదీ పరిస్థితి: రాజాం రోడ్డులోని జీబీఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఉంది. కళాశాలలో దూరప్రాంతాల కోసం వచ్చే విద్యార్థులు కోసం వసతిగృహ సదుపాయాన్ని గత ప్రభుత్వంలోనే కల్పించారు. చీపురుపల్లి–గరివిడి పట్టణాల మధ్య కళాశాలల వసతిగృహం ఉండడంతో అక్కడి నుంచి దూరమవుతోందన్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాలిటెక్నికల్ కళాశాల ఆవరణలోని ఓ భవనంలో కొద్దిరోజుల కిందట ఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. భోజనం కోసం విద్యార్థులే నెలకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. భవ నం కేటాయించారు తప్ప ఎలాంటి సౌకర్యాలు లేవు. విద్యార్థులు కటిక నేలపై చాపలు వేసుకుని నిద్రపో తున్నారు. మొత్తం 30 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు సరిపోవడంలేదు. ఇన్వెర్టర్ లేకపో వడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతే చీకటి లోనే గడుపుతున్నామంటూ విద్యార్థులు వాపోయారు.
గత ప్రభుత్వ హయాంలో భవన సదుపాయం
గత ప్రభుత్వ హయాంలో రూ.8 కోట్ల నాబార్డు నిధులతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అధునాతన భవనాలు నిర్మాణం జరిపించారు. 2024 ఫిబ్రవరి 4న అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. తరగతి గదులు, ల్యాబ్స్, స్టాఫ్ రూంలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అంతవరకు కళాశాల అరకొర సౌకర్యాలతో పరాయి పంచన నడిచేది.
సొంత ఖర్చులతో హాస్టల్ నిర్వహణ
నెలకు రూ.3 వేలు చెల్లించుకుంటున్న విద్యార్థులు
నేలపైనే నిద్ర
రెండే రెండు మరుగుదొడ్లతో అవస్థలు
ఎమ్మెల్యేకు విన్నవించినా పరిష్కారం కాని విద్యార్థుల సమస్యలు

పాపం.. పాలిటెక్నిక్ విద్యార్థులు!

పాపం.. పాలిటెక్నిక్ విద్యార్థులు!