
క్లౌడ్ సెంటర్‌గా సెంచూరియన్ విశ్వవిద్యాలయం
నెల్లిమర్ల రూరల్: క్లౌడ్ సెంటర్‌గా సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని తీర్చిదిద్దామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు అన్నారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ వర్సిటీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లో ఏఐ సాంకేతికతను చేరుస్తామన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న 50 సంస్థలతో తాము ఎంఓయూ కుదుర్చుకున్నామని చెప్పారు. దేశంలో 28 నానో చిప్స్ తయారు చేస్తున్న మొదటి విద్యాలయం సెంచూరియన్ అని తెలిపారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చాన్సలర్ జీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల శిక్షణలు అందిస్తున్నామని, ఏటా కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రశాంత కుమార్, రిజిస్ట్రార్ పల్లవి, తదితరులు పాల్గొన్నారు.
ఇష్టంతో చదివితే
విజయం మీదే..
● రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ
నెల్లిమర్ల: కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే విజయం వరిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. నెల్లిమర్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ మత్స్యకార బాలుర గురుకుల పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను రుచిచూశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సిబ్బంది పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జేడీ చినబాబు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులు జ్యోతిశ్రీ, శ్రీదేవి, జిల్లా బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్ డాక్టర్ కేబీవీ రావు, పాఠశాల ప్రిన్సిపల్ త్రినాథరావు పాల్గొన్నారు.
పేరు మార్చడం.. ఏమార్చడమేనా మీ విజనరీ పాలన?
● చంద్రబాబు పాలనా తీరుపై అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి ఎద్దేవా
గుమ్మలక్ష్మీపురం: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమ కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు మార్చడం, వాటిని అమలుచేయకుండా ఏమార్చడమే చంద్రబాబునాయుడు విజనరీ పాలన అని అరకు పార్లమెంట్ సభ్యులు గుమ్మ తనూజారాణి ఎద్దేవా చేశారు. జియ్యమ్మవలస మండలంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తల్లికి వందనం పథకాన్ని రూపకల్పన చేసినది విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ అంటూ చెప్పుకురావడం సిగ్గుచేటన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అమలుచేసిన అమ్మఒడి పథకానికి పేరును మార్చేసి, ఓ ఏడాది పథకం ఎగ్గొట్టి, తీరా తామే రూపకల్పన చేసినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరుమార్చారే తప్ప ఇప్పటివరకు పైసా సాయం రైతన్నల ఖాతాలో జమచేయకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు విజనరీ పాలన అంటే జనాన్ని మోసం చేయడమేనన్నారు.

క్లౌడ్ సెంటర్‌గా సెంచూరియన్ విశ్వవిద్యాలయం

క్లౌడ్ సెంటర్‌గా సెంచూరియన్ విశ్వవిద్యాలయం