
ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల చర్చ
విజయనగరం అర్బన్:
బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. జూన్ రెండో తేదీకల్లా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఎక్కడ చూసినా బదిలీలపై చర్చే నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబర్‌లో బదిలీలు చేసింది. పిల్లల చదువులు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన 15 శాఖల్లోనే అప్పట్లో సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టింది. తాజాగా అన్ని ప్రభుత్వ శాఖల్లో అనుమతివ్వడంతో ఈ సారి భారీ సంఖ్యలోనే ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది.
సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు
కొన్నేళ్లుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని 34 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు ప్రారంభమయింది. ఒకే ప్రాంతంలో ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి కావడంతో వాళ్లంతా సిఫార్సుల లేఖల కోసం నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాధాన్య పోస్టింగ్‌లకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం కొందరు పైరవీలు మొదలయ్యాయి. తమను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది. అటువంటి పలువురు ఉద్యోగులు కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రెవెన్యూ, పీఆర్‌లో భారీ పోటీ
ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, జిల్లా ప్రజా పరిషత్, ఇంజినీరింగ్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖలకు సంబంధించి విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్లతోపాటు ఆయా పట్టణాలకు చుట్టుపక్కల మండలాల్లో అనుకూలమైన పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. పెద్ద మండలాలకు వెళ్లేందుకు డీప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు అదేవిధంగా మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్‌ల నిమిత్తం గ్రామ కార్యదర్శులు ప్రయత్నిస్తున్నారు.
ఐదేళ్లు దాటిన వారికి తప్పనిసరి
ప్రాధాన్యం ఉన్న పోస్టులపై పలువురి
దృష్టి
సిఫార్సు లేఖలకు ప్రదక్షిణలు
సచివాలయాల్లో భారీ కదలికలు తప్పవు
సచివాలయ నిర్వహణ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పోస్టుల కుదింపు చర్యలు ఒకవైపు ఉంటే మరోవైపు బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో సచివాలయ ఉద్యోగుల స్థానచలనం భారీగానే ఉంటుంది. జిల్లాలోని 563 గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేడర్ సిబ్బంది 5,320 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఈ శాఖలో చేపట్టిన బదిలీ ప్రక్రియలో బదిలీ కోరిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గతేడాది బదిలీల పరిధిలోకి రాని ఉద్యోగులందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. దీంతో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ దృష్ట్యా ఉద్యోగుల సంఖ్యకూడా కుదించనున్నారు. ఈ పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలో స్థానచలనం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల చర్చ