
యోగాంధ్ర విజయవంతానికి ప్రణాళిక
● 100 మంది టీఓటీల ఎంపిక
● గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో
కార్యకర్తలు
● జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక
కార్యక్రమం
● జేసీ సేతుమాధవన్
విజయనగరం అర్బన్: కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్టు జేసీ సేతు మాధవన్ గురువారం తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు... ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వా ములను చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఉపాధి వేతనదారులు సుమారు 5 వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో యోగా స్ట్రీట్‌ను ఏర్పాటు చేసి, ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకో మండలం చొప్పున ఎంపిక చేసి ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. యోగా మంత్ కార్యక్రమం విజయవంతానికి 100 మంది టీఓటీలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు.
రీ సర్వే వినతులు పరిష్కరించాలి
● రెవెన్యూ అధికారులను ఆదేశించిన
కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: రెవెన్యూ, రీ సర్వే వినతులన్నీ వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చే వినతుల్లో 90శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, రెవెన్యూ అధికారుల అలక్ష్యమే దీనికి కారణమన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజక వర్గాల రెవెన్యూ అధికారులతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, అందరికీ గృహాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్, వాటర్ ట్యాక్స్, ఆన్‌లైన్ సర్వీసెస్ పెండింగ్, రీ సర్వే, పిజీఆర్‌ఎస్ వినతులపై జేసీతో కలిసి గురువారం సమీక్షించారు. అన్ని గ్రామాల్లో ఆక్రమిత భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. వచ్చే సోమవారం నుంచి ఈ విషయంపై వినతులు అందితే సంబంధిత వీఆర్వోపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ గృహాలు పథకం కింద జిల్లాలో 6 వేల దరఖాస్తులు అందాయని, వీటిని వెరిఫైచేసి శనివారం నాటికి ఆన్‌లైన్ చేయాలని తెలిపారు. రీ సర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలన్నారు. వాటర్ టాక్స్ జిల్లాలో సుమారుగా రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ.53వేలు వసూలు చేయడంపై అసహనం వ్యక్తంచేశారు. బదిలీలు పారదర్శకంగా సాగుతాయని, సిఫార్సులను అనుమతించబోమని స్పష్టంచేశారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో మురళీ, ఇన్‌చార్జి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి.రమణమూర్తి, తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలు పాల్గొన్నారు.

యోగాంధ్ర విజయవంతానికి ప్రణాళిక