
ఎవరెస్టు ఎక్కినా ఉపాధి కరువే..!
జియ్యమ్మవలస రూరల్: రాత్రింబవళ్లు శ్రమించి.. కఠోర సాధన చేసి.. చివరకు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మన్యం బిడ్డ.. ఉపాధిలేక దిక్కులు చూస్తున్నాడు. తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమే. ఎన్నో ఆశలు ఆశయాలు ఆలోచనల నడుమ ఎవరెస్టు శిఖరాన్ని జియ్యమ్మవలస మండలం పరజపాడు పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన బొడ్ల చిన్న నారాయణరావు తవిటమ్మల కుమారుడు బొడ్ల సాగర్ అధిరోహించాడు. యువకుడి సాహసాన్ని మే 7వ తేదీ 2017 సంవత్సరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని పత్రికలు ప్రచురించి ప్రశంసలతో ముంచెత్తాయి. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు జిల్లా అధికారులు సైతం సాగర్ సాహసంపై ప్రశంసలు కురిపించారు. సన్మానాలు చేశారు. విద్యార్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అంతే.. ఆ తరువాత 8 సంవత్సరాలు గడిచిపోయినా.. ఈ ఎవరెస్టు వీరుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు భద్రగిరి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తూ సుమారు 6 నెలల పాటు కఠోరమైన శిక్షణ పొంది 120 మందిలో కేవలం ఆరుగురు మాత్రమే ఎవరెస్టు శిఖరం ఎక్కగలిగారు. వారిలో సాగర్ ఒకడు. ఆ ప్రయాణంలో తన కుడిచేతి రెండు వేళ్లను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత ఏళ్లు గడిచినా సాగర్‌కు ఎలాంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తండ్రితో కూలి పనులకు, బోర్లు వేసేందుకు వెళ్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని కూలి డబ్బులతో నెట్టుకొస్తున్నాడు. సాగర్‌ను ఉద్యోగిగా చూడాలన్న కన్నవారి కలలు కలగానే మిగిలాయి. పర్వతారోహణకు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.25లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా.. విజయాన్ని, పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన ఆ యువకుడిన ఆదుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పత్రికల్లో వచ్చిన
కథనాలను చూపిస్తున్న సాగర్

ఎవరెస్టు ఎక్కినా ఉపాధి కరువే..!