గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో గిరిజన, మైదాన ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో నమోదైన గంజాయి కేసులను పరిశోధించాలి.. మూలాలను వెలికితీసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ వకుల్‌జిందల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మాసాంతర నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణా జరగకుండా కొత్తగా ఏర్పాటుచేసిన నాలుగు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నెల రోజుల్లో నమోదైన కేసుల పురోగతిపై సమీక్షించారు. శక్తియాప్ ఫిర్యాదులు 112, బీఎన్‌ఎస్, ఎస్టీ, ఎస్పీ, పోక్సో, ఎన్డీపీఎస్, మిస్సింగ్, మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాత్రి 11 గంటల తర్వాత అకారణంగా ఎవరైనా రోడ్ల మీద తిరిగితే కేసులు నమోదు చేయాలన్నారు. హిస్టరీ షీట్ల వివరాలను సీసీటీఎన్‌ఎస్ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై అవగాహన కల్పించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. ఇ–బీట్స్, వి–సాక్ష్య యాప్‌లను ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నాన్ బెయిల్‌బుల వారెంట్లను ఎగ్జిక్యూటివ్ చేయాలని, రోడ్ ప్రమాదాల్లో హిట్ అండ్ రన్ కేసులలో బాఽధితులకు పరిహారం అందించేందుకు రెవెన్యూ అధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలతతో పాటు విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి డీఎస్పీలు గోవిందరావు, రాఘవులు, భవ్యారెడ్డి, లీగల్ ఎడ్వయిజర్ పరశురామ్, ఎస్పీ సీఐలు గోవిందరావు, చౌదరి, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.
చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలకు ఆదేశం
శివారు ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలి
ఎస్పీ వకుల్ జిందల్


