
జనసేన నాయకుడి బరితెగింపు
● ఎమ్మెల్యే సమక్షంలో రెచ్చిపోయిన వైనం ● గందరగోళంగా మండల సర్వసభ్యసమావేశం ● జనసేన, వైఎస్సార్‌సీపీ నాయకులు వేర్వేరుగా ఎంపీడీఓకు ఫిర్యాదు
పూసపాటిరేగ: పూసపాటిరేగ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జనసేన, టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సభ్యులుకాని జనసేన నాయకుడు పతివాడ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు ఇజ్జరోతు ఈశ్వరరావు సమావేశానికి హాజరై సభ్యులను ప్రశ్నించడం వాగ్వాదానికి దారితీసింది. రోడ్ల ఆక్రమణపై ఎమ్మెల్యే లోకం నాగమాధవికి పతివాడ ఎంపీటీసీ సభ్యుడు పతివాడ అప్పలనాయుడు ఫిర్యాదు చేస్తుండగా రెల్లివలస సర్పంచ్ ఇజ్జరోతు అప్పలరాజు అడ్డుతగిలారు. ఆక్రమణలు చేసినది మీరంటే మీరే అంటూ ఆరోపణలు చేసుకున్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత పై అంతస్తు నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు దిగుతుండగా జనసేన నాయకుడు పతివాడ శ్రీనివాసరావు, ఎంపీపీ మహంతి కల్యాణి భర్త మహంతి
శ్రీనివాసరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త తోపులాటకు దారితీయడంతో పోలీసులు సర్దిచెప్పారు. అర్హత లేకుండా సభకు రావడమే కాకుండా సభ్యులపై పతివాడ శ్రీనివాసరావు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం ఎంపీడీఓ రాధికకు ఎంపీపీ మహంతి కల్యాణి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్ సర్వసభ్యసమావేశంలోకి వచ్చి గొడవలకు కారణమైన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీఓను కోరారు. ఎంపీపీ కల్యాణి లేకుండా ఆఫీసు గది తలుపులు తీయడం నిబంధనలకు విరుద్ధమని జనసేన నాయకులు ఎంపీడీఓకు ఫిర్యాదుచేశారు.