
ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పోలీసు పికెట్
● వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌పై దాడి నేపథ్యంలో గ్రామంలో పర్యటించిన సీఐ, ఎస్‌ఐ
● దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
వంగర: నాయకులు, వ్యక్తులపై దాడులకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు హెచ్చరించారు. ఈ నెల 2వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ వంగర మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుపై దాడి కేసు నమోదైన నేపథ్యంలో ఎస్‌ఐ షేక్‌శంకర్‌తో కలిసి గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు కక్షపూరితంగా వ్యవహరించొద్దని, గుంపులుగా తిరగవద్దని, అవాంఛనీయ ఘటనలకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎటువంటి వివాదాలకు పాల్పడొద్దని, శాంతియుతంగా మెలగాలని సూచించారు. శ్రీహరిపురం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుదర్శనరావుపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ శనపతి సత్యారావు, ప్రజలు పోలీసులను కోరారు.