
కానరాని హెచ్చరిక బోర్డులు....
అధికార బలం ఉంది. నియోజకవర్గ నేత అండ దండిగా ఉంది. దేవుడి భూములను ఆక్రమిస్తే అడిగేవారెవరని విర్రవీగుతూ.. చీపురుపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా చీపురుపల్లిలోని ఉమానీ లకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములను అమ్మకానికి పెట్టేశాడు. రూ.లక్షలు ఇచ్చేవారికి స్థలాలు కట్టబెడుతూ అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నాడు. కళ్లముందే దేవుడి భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారిని ఆనుకుని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం భూమిలో సాగుతున్న నిర్మాణాలు
చీపురుపల్లి:
విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారికి ఆనుకుని, చీపురుపల్లి–గరివిడి పట్టణాల మధ్య ఉన్న చీపురుపల్లి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఎకరా ధర రూ.కోట్లలో పలుకుతోంది. వీటిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. తనదైన శైలిలో ఆక్రమణలకు పథకం రూపొందించాడు. మార్కెట్‌లో బేరం పెట్టేశాడు. రూ.లక్షల్లో డబ్బులు వసూలుచేసి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నాడు. ఈ పాపంలో దేవదాయశాఖ అధికారులను భాగస్వాములు చేస్తున్నట్టు సమాచారం. అందుకే.. దేవస్థానం భూముల్లో కళ్లముందే కట్టడాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవుడి భూములను పరిరక్షించేందుకు పెద్ద వ్యవస్థ ఉన్నా కనీసం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆక్రమణల వ్యవహారమంతా ‘పైసామే పరమాత్మ’ అన్నట్టు సాగుతోందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. అటు నాయకులు.. ఇటు అధికారులు కలిసి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములకు శఠగోపం పెడుతున్నట్టు స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు క్యాంప్ కార్యాలయానికి సమీపంలో దేవస్థానం భూముల్లో అక్రమ కట్టడాలు సాగుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. అక్రమ నిర్మాణాలు, కట్టడాలు అధికారులకు తెలిసే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఓ నాయకుడు నిర్మాణదారులు, దేవదాయశాఖ అధికారుల మధ్యన డబ్బుల మధ్యవర్తిత్వం నడుపుతున్నట్టు సమాచారం. నియోజకవర్గ నేత అండ ఉందని, అంతా చూసుకుంటానని నమ్మించి దేవుడి భూముల్లో కట్టడాలకు దన్నుగా నిలుస్తున్నాడు. ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. మధ్యవర్తిత్వం నడుపుతున్న టీడీపీ నాయకుడిపై ఆ పార్టీ వర్గాలే గుర్రుగా ఉన్నాయి. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
నిర్మాణాలు
ఆపేదెవరు?
రెవెన్యూకు దరఖాస్తు చేశాం
సర్వే నంబర్ 135లో 18.89 ఎకరాల నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు గతంలోనే రెవెన్యూకు దరఖాస్తు చేశాం. రెవెన్యూ సదస్సుల్లోనూ అధికారులకు విన్నవించాం. ఆక్రమణల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. దేవస్థానం భూముల్లో త్వరలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. 18 ఆలయాల బాధ్యతలు చూస్తున్నాను. ప్రధానంగా తను రామతీర్థంలో ఉంటాను.
– వై.శ్రీనివాసరావు, ఈఓ, నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం, చీపురుపల్లి
కళ్లెదుటే నిర్మాణాలు జరుగుతున్నా
పట్టించుకోని దేవదాయశాఖ
కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టని వైనం
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న
అధికార పార్టీ నాయకుడు
డబ్బులతో బేరసారాలు!
చీపురుపల్లిలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములకు రక్షణ కరువు
ఆవేదనలో భక్తజనం
చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం, వంగపల్లిపేట ప్రాంతంలో ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నంబర్ 135లో 18.89 ఎకరాలు భూములు ఉన్నాయి. పూర్వ కాలం నుంచి దేవస్థానం భూములే అయినప్పటికీ 2018లో నిషేధిత భూములు జాబితా అమల్లోకి వచ్చినప్పుడు ఈ భూములను 22(ఎ)కి చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అంతకుముందు మాత్రం క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగేవి. 2018 తరువాత రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఆ భూముల్లో నిర్మాణాలు నిషేధమని దేవదాయశాఖ కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం గమనార్హం.
విజయనగరం–పాలకొండ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములు విలువ ఎకరా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య పలుకుతోంది. అంతటి విలువైన స్థలం ఆక్రమణలకు గురై, యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతుంటే దేవదాయశాఖ అధికారులు కనీసం నిలువరించే చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. నిర్మాణాలు జరుపుతున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడి నిర్మాణాలపై దేవదాయశాఖ అధికారుల తీరు చూస్తుంటే ‘కంచే చేనుమేస్తే’ అన్న చందంగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

కానరాని హెచ్చరిక బోర్డులు....