
బర్త్ సర్టిఫికెట్ల దరఖాస్తుల స్వీకరణలో అలసత్వం వద్దు
పార్వతీపురం టౌన్: జిల్లాలో 6 ఏళ్ల లోపు వయసు గల పి ల్లలకు జారీచేయనున్న బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో అలసత్వం వద్దని జాయింట్ కలెక్టర్ మండల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ సీతంపేట, బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పాలకొండ, పార్వతీపురం, సాలూరు అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు దరఖాస్తులు స్వీకరించక పోవడంపై ఆమె ఆరా తీశారు. శనివారం ఉదయానికి ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలని, లేదంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బర్త్ సర్టిఫికెట్లు మంజూరైతే, ఈ నెలాఖరులోగా పిల్లలకు ఆధార్ కార్డులు వస్తాయని, కావున దీనిపై అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నరేగా పనుల్లో కూడా అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సగటు దినసరి వేతనం రూ.300లు ఉండేలా అధికారులు చొరవ చూపాలని చెప్పారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫారంపాండ్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, కావున దీనిపై దృష్టి సారించి ప్రతి గ్రూపు కనీసం ఐదు ఫారంపాండ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంజినీరింగ్ అదికారులు చొరవ చూపాలి
జిల్లాలో చేపడుతున్న గృహనిర్మాణాల్లో ఇంజినీరింగ్ అధికారులు చొరవ చూపేలా మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జేసీ ఆదేశించారు. ప్రతి మండలంలో ప్రతిరోజూ గృహ నిర్మాణాల ప్రగతి ఉండాలని, లేదంటే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉండే గృహ నిర్మాణాల్లో ముందుగా తుది దశకు చేరుకున్న గృహాలపై ప్రత్యేక దృష్టిని సారించి వాటిని పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పథకాల గృహాలతో పాటు ముఖ్యంగా పీఎం జన్‌మన్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జేసీ స్పష్టం చేశారు.
పీజీఆర్‌ఎస్ త్వరితగతిన పరిష్కారం కావాలి
ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే దరఖాస్తులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జేసీ అన్నారు. సోమవారం రోజున వచ్చే దరఖాస్తులన్నీ వచ్చే సోమవారానికి ఏ ఒక్కటీ పెండింగ్ లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, గృహనిర్మాణ సంస్థ, డీఆర్డీఏ, డ్వామా, పీడీలు డా.పి.ధర్మచంద్రారెడ్డి, ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, పంచాయతీ అధికారులు కె.రాబర్ట్‌పాల్, బి.శ్యామల, డా.ఎన్.మన్మథరావు, టి.కొండలరావు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నరేగా పనుల్లో మరింత ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
హౌసింగ్‌పై మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక