విశాఖ ఉక్కుకు మళ్లీ మంచి రోజులు: సీఎండీ | - | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కుకు మళ్లీ మంచి రోజులు: సీఎండీ

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ వచ్చే మార్చి చివరి నాటికి లాభాల్లోకి వస్తుందని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలాఖరున పదవీ విరమణ పొందుతున్న 30 మంది అధికారులు, 79 మంది కార్మికులకు శనివారం ఉక్కు యాజమాన్యం ఆధ్వర్యంలో సామూహిక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌ అభివృద్ధి కోసం ఉద్యోగులు దాదాపు 37 ఏళ్ల పాటు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. విధుల నిర్వహణలో భాగంగా కుటుంబాలకు, పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాంట్‌ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. తాను కూడా సాధారణ కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తినని, ఉద్యోగుల సమస్యలు తనకు బాగా తెలుసని తెలిపారు. కొంత సమయం ఇస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్లాంట్‌ పురోగతికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) ఎ.కె. బాగ్చి, డైరెక్టర్‌ (కమర్షియల్‌) జీవీఎన్‌ ప్రసాద్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) వినయ్‌కుమార్‌తో పాటు సీజీఎంలు, జీఎంలు, విభాగాధిపతులు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement