ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపివేయాలి

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

● మెడికల్‌ షాపుల నిర్వాహకుల డిమాండ్‌ ● ప్రశాంతంగా మందుల దుకాణాల బంద్‌

మహారాణిపేట: ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని మందుల దుకాణాల యాజమానులు డిమాండ్‌ చేశారు. ది విశాఖపట్నం జిల్లా డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం విశాఖలో మందుల దుకాణాలను బంద్‌ చేసి నగరంలో ప్రదర్శన నిర్వహించారు. జగదాంబ జంక్షన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేసి, అనంతరం కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌ డ్రగ్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.సీతారామయ్య మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ అమ్మకాల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. అలాగే కార్పొరేట్‌ సంస్థలు ఇస్తున్న అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలన్నారు. దీనివల్ల సాధారణ మందుల దుకాణాల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే కొంతమంది స్వార్థం కోసం నకిలీ మందులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.రామచంద్రరావు మాట్లాడుతూ.. రోగుల భద్రతను పరిగణనలోకి తీసుకుని నకిలీ మందుల విక్రయాలను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారమే మందుల విక్రయాలు జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, మందుల దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా బంద్‌

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలకు నిరసనగా మెడికల్‌ షాపులు బుధవారం బంద్‌ పాటించాయి. అఖిల భారత కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌ల సంఘం పిలుపు మేరకు విశాఖ జిల్లా అసోసియేషన్‌ నాయకులు మందుల దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. జిల్లాలో దాదాపు 1600 దుకాణాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. ఆసుపత్రులకు అనుసంధానంగా పనిచేసే ఫార్మసీలు మాత్రం యథావిధిగా పనిచేశాయి. బంద్‌కు సహకరించిన మందుల దుకాణాల యాజమానులకు అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement