విశాఖలో మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌ నీటి సరఫరా, యూజీడీ వ్యవస్థల ఆధునికీకరణకు పెద్దపీట జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

డాబాగార్డెన్స్‌: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచే మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎపెక్స్‌ కమిటీ(ఎన్‌ఏసీ), జీవీఎంసీ, గ్రేటర్‌ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌లు సంయుక్తంగా అందజేసిన మూడు అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. మధురవాడలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, అదే ప్రాంతంలో 24/7 నిరంతర తాగునీటి సరఫరా, అలాగే నగర వ్యాప్తంగా బల్క్‌ అండ్‌ సెమీ బల్క్‌ నీటి సరఫరా వ్యవస్థను ఆటోమేషన్‌ చేయడం.. వంటి మూడు కీలక ప్రాజెక్టులను రూ.1,501.03 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యయంలో అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.375.26 కోట్ల గ్రాంట్‌ లభించనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులను యూసీఎఫ్‌ గ్రాంట్లతో పాటు ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలు, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ వంటి జాతీయ బ్యాంకుల టర్మ్‌ లోన్ల సమ్మిళిత ఆర్థిక నమూనా ద్వారా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఈస్ట్‌, భీమిలి జోన్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఆధునిక భూగర్భ మురుగునీటి సౌకర్యం, 24 గంటల తాగునీటి సరఫరా వంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement