విశాఖ స్పోర్ట్స్: క్రీడల్లో రాణించాలనుకుంటున్నారా? ఆటలతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం పొందాలనుకుంటున్నారా? జాతీయ క్రీడాకారుడిగా ఎదిగి, మీకు నచ్చిన ఆటలో ప్రత్యేకంగా ప్రతిభ చూపాలని ఉందా? ఎనిమిదేళ్ల వయసులోనే భవిష్యత్తు క్రీడాకారుడిగా ఎదగటమే మీ లక్ష్యమైతే.. ఇదో చక్కటి అవకాశం. కడపలోని వైఎస్సార్ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 2వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు విధానం ఇలా..
ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల విద్యార్థులు జ్ట్టిఞ:// టఞౌట్టట. ్చఞ. జౌఠి. జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలు నాలుగో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూల్‌లో 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కేవలం మిగిలిన సీట్లలో మాత్రమే ప్రవేశానికి అవకాశం ఉంటుంది. నాలుగో తరగతికి సంబంధించి బ్యాటరీ టెస్ట్ క్వాలిఫై అయితే నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత ఎంపిక ట్రయల్స్ మొదలవుతాయి.
జిల్లా స్థాయి నుంచే ఎంపికలు..
ప్రతి జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం, జిల్లా స్థాయిలోనే తొలి దశ ఎంపిక ఉంటుంది. ఈ ప్రక్రియలో నిర్వహించే బ్యాటరీ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారిని రాష్ట్రస్థాయి ఎంపికలకు ఆహ్వానిస్తారు. ఇక్కడ ఎంపికై తే.. అన్ని వసతులతో కూడిన క్యాంపస్‌లో, నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ మొదలవుతుంది. ఈ ప్రాథమిక తరగతుల్లో క్రీడలపై అవగాహన, ప్రాథమిక శిక్షణ ఇస్తారు. విద్యార్థికి ఏ క్రీడ పట్ల ఆసక్తి ఉందో గుర్తించి, ఆ క్రీడను ఎంపిక చేసుకోవడం అనేది తర్వాతి దశలో ఉంటుంది. రెసిడెన్షియల్ విధానంలో ఆటలతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, వైద్య సౌకర్యాలు ఉచితంగా అందిస్తారు.
ఎంపిక ట్రయల్స్ ఇలా..
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మోటార్ ఎబిలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి ట్రయిల్స్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను.. రాష్ట్రస్థాయి వైద్య పరీక్షలు, ఆధునాతన మోటార్ ఎబిలిటీ టెస్ట్‌ల కోసం ఆహ్వానిస్తారు. ఈ చలన సామర్థ్య పరీక్షలు రెండు స్థాయిల్లో ఉంటాయి. మోటార్ ఎబిలిటీలో 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్‌ను విద్యార్థి సరళ వేగాన్ని పరీక్షించడానికి, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌ను క్షితిజ సమాంతర బలాన్ని పరీక్షించడానికి, మెడిసిన్ బాల్ త్రో(1 కేజీ)ను భుజాల బలాన్ని అంచనా వేయడానికి, 6 ్ఠ10 మీటర్ల షటిల్ రన్‌ను శరీర చురుకుదనాన్ని పరీక్షించడానికి, ఫార్వర్డ్ బెండ్ రీచ్, 600 మీటర్ల పరుగును స్టామినా పరీక్షించేందుకు నిర్వహిస్తారు. వీటిలో 60 శాతం మార్కులు సాధించిన వారిని స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకుంటారు. క్రీడా రంగంలో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించడమే మీ ఆశయమైతే.. తొలి అడుగు ఇప్పుడే వేయండి. ఆల్ ద బెస్ట్.!


