అమ్మా.. నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నాకే ఎందుకు ఈ వ్యాధి వచ్చింది?

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

● ఏడేళ్ల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి ● ఆపరేషన్‌కు రూ.45 లక్షలు ● ఆదుకునే దాతల కోసం ఎదురుచూపు

పెదగంట్యాడ: ‘అమ్మా.. నేనేం పాపం చేశానమ్మ? నాకే ఎందుకు ఇలాంటి వ్యాధి వచ్చింది? నాన్నా.. నన్ను బతికించలేవా? నాకు బతకాలని ఉంది.. అందరితో కలసి ఆడుకోవాలని ఉంది.. నాకు ప్రాణం పోయండి’అంటూ ఆ ఏడేళ్ల చిన్నారి ఆవేదన ఆ తల్లిదండ్రుల గుండెల్ని పిండిస్తోంది. ప్రాణాంతకమైన వ్యాధి నుంచి తమ గారాలపట్టిని రక్షించుకోవడానికి ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఆపరేషన్‌ కోసం రూ.45 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ బిడ్డను బతికించుకునేందుకు మనసున్న మహారాజులు సాయం చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.

జీవీఎంసీ 74వ వార్డు పరిధిలోని పోలీస్‌ క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న దయాల్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఎం.కె.రాజు, లలితాగౌరీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె కేసవి (7) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో అవస్థ పడుతోంది. వ్యాధి ఏమిటో తెలుసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రులు లేవు. చివరకు ఆ చిన్నారికి అరుదైన తలసేమియా వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో కన్నవారు నిర్ఘాంతపోయారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి రక్తంలో ప్లేట్‌లెట్లు ఒక్కసారిగా పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసి, పాప ప్రాణాలు దక్కాలంటే తప్పనిసరిగా ‘బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌’చేయాలని సూచించారు. ఇందుకు సుమారు రూ.45 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ‘బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా’అంటూ చిన్నారి విలవిల్లాడుతుంటే.. మౌనంగా రోదించడం మినహా ఇంకేమీ చేయలేని అసహాయ స్థితి వారిది. ఆర్థిక స్థోమత లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు

చిన్నారి తండ్రి రాజు కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. నెలకు వచ్చే రూ.15 వేల జీతంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అద్దె ఇంట్లోనే ఉంటూ అతికష్టం మీద జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో తమ బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

మా బిడ్డను కాపాడండి

ఇప్పటికే తమ ఆర్థిక స్థోమతకు మించి ఆ తల్లిదండ్రులు చిన్నారి వైద్యం కోసం చాలానే ఖర్చు చేశారు. అప్పులు చేసి మరీ ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. చిన్నారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలంటే రూ.45 లక్షలు ఖర్చు కానున్న నేపథ్యంలో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించే హృదయాల కోసం ప్రాధేయపడుతున్నారు.

వ్యాధికి సంబంధించిన రిపోర్టులతో తల్లిదండ్రులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కేసవి

దాతలు సంప్రదించాల్సిన వివరాలివి..

బ్యాంకు ఖాతా పేరు లలితా గౌరీ పోలవరపు

బ్యాంకు పేరు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌

ఖాతా నంబర్‌ 103701000019880

ఫోన్‌ నంబర్లు 73969 45349,

99851 27591

Advertisement
 
Advertisement
Advertisement