తగరపువలస : మండలంలోని గొల్లల తాళ్లవలస సర్వే నంబర్ 162లో గల గెడ్డవాగు భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. సుమారు రూ.12 కోట్ల విలువైన 1.20 ఎకరాల వాగు భూమిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు దినాన్ని అదనుగా చేసుకుని ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపింది. ‘గెడ్డవాగులో.. ఆక్రమణల గెద్దలు’ శీర్షికతో గత నెల 30న సాక్షిలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ సెలవు రోజుల్లో దొంగచాటుగా పనులు కొనసాగిస్తున్నారు. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో ఇళ్లు, పాఠశాల కోల్పోయిన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా ఈ గెడ్డవాగులో తాత్కాలిక నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. తాత్కాలికం పేరుతో ఇక్కడ ఏకంగా భారీ భవనాలు నిర్మిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జలవనరుల భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ, రెవెన్యూ అధికారులు స్థానిక టీడీపీ నాయకులతో కుమ్మకై ్క పదేపదే ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితుల నుంచి కొందరు నాయకులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలోనూ ఈ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసులు పలువురిని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. పంచాయతీలో ఇతర బంజరు భూములు అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలని వాగు భూములను కేటాయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి గెడ్డవాగులో ఆక్రమణలను అడ్డుకోవాలని, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి బాధితులకు ఇతర ప్రాంతాల్లో శాశ్వత స్థలాలు కేటాయించాలని తాళ్లవలస వాసులు డిమాండ్ చేస్తున్నారు.
‘గెడ్డవాగులో.. మళ్లీ వాలిపోయిన
ఆక్రమణల గెద్దలు’


